Monday, April 6, 2026
E-PAPER
Homeదర్వాజబడికి వెళ్ళే పిల్లలు

బడికి వెళ్ళే పిల్లలు

- Advertisement -

నీకు నేను ఒక పిడికెడు ఆకాశాన్నిస్తాను… ఏం జేస్తావు
నువ్వు సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరౌతూండగా
నేను నీకు ఒక దోసెడు సముద్రాన్ని దానం చేస్తాను
కేరింతలు కొడ్తున్న పసిడి శిశువులా కిలకిలా నవ్వుతూ
నా కళ్ళలోకి నువ్వు ఒక సూర్యునిలా చూస్తూండగా
నేను నీటి తుంపరలు తుంపరలుగా నీపై గిలిగింతలై వర్షిస్తాను
సరిగ్గా అప్పుడే రేకులు విచ్చుకుంటున్న పువ్వువై నువ్వు వికసిస్తూంటావు –
నువ్వు ఒక కొడవలిలా ఆలోచనలతో పదునెక్కుతూ పదునెక్కుతూ
‘ఇప్పుడు నేనేం చేయాలె’ అని నువ్వు ఒక ప్రశ్నగా మారుతూండగా
నేను రవ్వంత నిప్పును రాజేసి నీలో అగ్నిని ప్రతిష్టిస్తాను
నువ్వు ఇక ఒక ‘ఉక్కుసంకల్పాన్ని’ రూపొందించుకుని
జీవితాన్ని నిర్మించుకోవడం మొదలెడ్తావు
అప్పుడు నీ పేరు ‘బడికి వెళ్ళే బాలుడు’ –
చేతిలో ఒక పలకా, ఒక బలపం… అక్షరం కోసం దాహంతో
నీ కళ్ళనిండా ప్రజ్వలిస్తూన్న ఒక ప్రపంచం వికసిస్తూండగా..,
ఇప్పుడు చెప్పు ప్రపంచం నీకనా పెద్దదా
– నువ్వే ప్రపంచంకన్నా ఉన్నతుడవా?
2
తలనిండా స్వప్నాలు నిండిన దేహాలతో
తరగతి గదుల్లోకి తడిమట్టిలోకి విత్తనాలు విత్తనాలుగా
బడిపిల్లలు గుంపులు గుంపులుగా వచ్చి
తపస్సిస్తున్న ఋషుల్లా తరగతిలో కూర్చున్న పవిత్ర సమయంలో
‘వాడు’ పైనుండి ఫెళఫెళార్భటులతో క్షిపణుల stelth బాంబులను వర్షిస్తూ
ఒక విస్ఫోటనాన్ని సష్టిస్తాడు ప్రళయ భీకర ధ్వంసధ్వనులతో
లిప్తకాలంలో అందరి శరీరాలూ తునాతునకలై రక్తాన్ని చిమ్ముతూ..,
ఎర్రని నెత్తురు చెరువులో వందల కుందేళ్ళ మతదేహాలు గుట్టలౌతున్నపుడు
ఆ రక్తకాసారం పేరు ఇరాన్‌ కావచ్చు,
ఇజ్రాయిల్‌ కావచ్చు, పాకిస్తాన్‌ కావచ్చు
అమెరికా కావచ్చు, ఉక్రెయిన్‌ కావచ్చు,
గాజా కావచ్చు, అఫ్ఘనిస్తాన్‌ కావచ్చు-
వాళ్ళు తాలిబాన్లు కావచ్చు, హౌతీలు కావచ్చు, హిజ్బుల్లాలు కావచ్చు
వ్యక్తులుగా వాళ్ళు ట్రంప్‌ కావచ్చు, నెతన్యూహు కావచ్చు,
అయతుల్లా అలీ ఖుమేనీ కావచ్చు,
అసీం మునీర్‌ కావచ్చు, చైనా జిన్పింగ్‌ కావచ్చు,
రష్యా పుతిన్‌ కావచ్చు
వందల మీటర్ల లోతు కాంక్రీట్‌ భూగహాలనూ, పర్వత గర్భాలనూ ఛేదిస్తూ
ప్రళయించే క్షిపణులను కనిపెట్టిన ఓ మనిషీ
నువ్వు ‘ఒక’ మనిషిని సృష్టించగలవా?
రక్తాన్ని తాగే మనిషీ నువ్వు ఒక ‘రక్త’ బిందువును సృష్టించగలవా?
(19-03-2026, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన 1920లో స్థాపించబడిన, ముంబాయి మహానగరం దాదర్లోని ప్రఖ్యాత ‘ది ముంబయి ఆంధ్ర మహాసభ డ జింఖానా’ నిర్వహించిన మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని వినిపించిన సమకాలీన కవిత )

– రామా చంద్రమౌళి, 9390109993

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -