Monday, April 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుముడుపులు చెల్లిస్తేనే మ్యుటేషన్‌..!

ముడుపులు చెల్లిస్తేనే మ్యుటేషన్‌..!

- Advertisement -

డీసీలు, ఏఎంసీల వద్ద దరఖాస్తులు పెండింగ్‌
డిప్యూటీ కమిషనర్లపై భారీగా అవినీతి ఆరోపణలు
బడంగ్‌పేట డీసీ సస్పెన్షన్‌తో తెరపైకి ఆక్రమాలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ముడుపులు చెల్లిస్తేనే మ్యుటేషన్లకు మోక్షం లభిస్తోంది. లేదంటే డీసీలు, ఏఎంసీల వద్దనే ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. బిల్‌ కలెకర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు మధ్యవర్తులుగా ఈ దందా సాగుతోంది. ఇందుకు జోనల్‌ స్థాయి అధికారులు సైతం సహకరిస్తుండటంతో ఒక్కో సర్కిల్‌ పరిధిలో వందల సంఖ్యలో పైల్స్‌ పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. దరఖాస్తుదారులు కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా.. ఫలితం లేకుండా పోతోంది. ఇటీవల బడంగ్‌పేట డీసీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌ వేటు పడటంతో సర్కిల్‌ అధికారుల అక్రమాలు మరోసారి తెరపైన వినిపిస్తున్నాయి.

డీసీ, ఏఎంసీల వద్దే పెండింగ్‌
మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో లంచాలు ఇస్తేనే దరఖాస్తులు ఆమోదం పొందుతున్నాయి. ఏడాదిలో మ్యుటేషన్‌, ఆస్తిపన్ను సవరణ, ఇంటి నెంబర్లు, పన్ను మినహాయింపు సేవలకు సంబంధించి వేల దరఖాస్తులు తిరస్కరణకు గురవడం, వేల దరఖాస్తులు ఉప కమిషనర్లు (డీసీ), సహాయ ఉప కమిషనర్ల (ఏఎంసీ)ల వద్ద పెండింగ్‌లో ఉండటమే ఇందుకు నిదర్శనం. బిల్‌ కలెక్టర్లు. ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి కమీషన్లు అందిన దరఖాస్తులనే అధికారులు ఆమోదిస్తున్నారు. ప్రత్యేక మల్కాజిగిరి కార్పొరేషన్‌ ఏర్పడ్డాక అవకతవకలు మరింత పెరిగాయి. ఎంఎంసీ పరిధిలో 14 సర్కిళ్లు ఉండగా, ఇందులో సగం మంది డీసీలు కమీషన్లు లేనిదే ఫైళ్లను ఆమోదించడం లేదు. ఒక్క సరూర్‌నగర్‌ పరిధిలోనే దాదాపు 300 వరకు పైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యం, రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్‌ నుంచే నిర్లక్ష్యం మొదలైంది. జోనల్‌, సర్కిళ్ల నుంచి వెళ్లే పన్ను సవరణ, మినహాయింపు, జనన, మరణ ధ్రువపత్రాల ఫైళ్లు రోజుల తరబడి నిలుస్తున్నాయి.

గత సర్కార్‌ ఆదేశాలు బేఖాతర్‌
‘లింకు డాక్యుమెంట్లు, సేల్‌ డీడ్‌, ఈసీ ఉంటే చాలు.. ప్రతి దరఖాస్తునూ నేరుగా ఆమోదించండి. క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేదు’ అని గత సర్కారు జీహెచ్‌ఎంసీకి స్పష్టం చేసింది. అయినా సిబ్బంది తనిఖీలకు వెళ్లి లంచాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆస్తిపన్ను సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేషన్‌ పరిధిలోని సర్కిల్‌ ఆఫీసుల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. పెండింగ్‌లోని దరఖాస్తులను పరిష్కరించాలని ప్రజలు ఆయా శిబిరాలను ఆశ్రయిస్తున్నా.. అధికారులు మాత్రం ఏమాత్రమూ పట్టించుకోవటం లేదు. ఓ వైపున ఏసీబీ, విజిలెన్స్‌ దాడుల్లో సగటున నెలకు ఐదారుగురు అధికారులు పట్టుబడుతున్నా.. వారిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

శివారు ప్రాంతాలే ఆదాయ వనరులు
డిప్యూటీ కమిషనర్లు హైదరాబాద్‌ మహానగర శివారు ప్రాంతాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బడంగ్‌పేట సర్కిల్‌లో అవినీతి వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం. డీసీలు సర్కిళ్ళ పరిధిలో అక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగానూ మద్దతునిస్తూ అధిక సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు ఇంజినీరింగ్‌ పనులు, అటు అక్రమ నిర్మాణాల నియంత్రణ, మరోవైపు అడ్వర్‌టైజ్‌మెంట్‌ హౌర్డింగ్‌ల తొలగింపు, నిర్వహణా వ్యవహారాల్లో డిప్యూటీ కమిషనర్లు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెద్దఎత్తున పైరవీలు చేస్తూ.. తమకు అనుకూలంగా ఉన్న మున్సిపల్‌ సర్కిళ్ళకు వెళ్తున్నారనేది వీరిపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. వీరికి జోనల్‌ కమిషనర్లు తోడు కావడంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ముందుకు సాగుతూ ‘ఏసీబీ’కి పట్టుబడుతున్నారు. అయినా ఏ మాత్రమూ భయపడకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -