22 ప్రధాన హామీలతో లెఫ్ట్‌ఫ్రంట్ మ్యానిఫెస్టో విడుదల
ఉపాధి, సామాజిక భద్రతకు ప్రాధాన్యత
ఉచిత విద్యుత్, సమాన పనికి సమాన వేతనం : వెల్లడించిన ఎల్‌ఎఫ్ చైర్మెన్ బిమన్‌బసు
కోల్‌కతా : బెంగాల్‌లో చీకటిని తొలగించి ‘వెలుగును తిరిగి తీసుకువచ్చే పోరాటం’ ప్రారంభించాలన్న పిలుపుతో లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. శనివారం అలీముద్దీన్ స్ట్రీట్ కార్యాలయంలో జరిగిన లెఫ్ట్ పార్టీల మీడియా సమావేశంలో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ బిమన్‌బసు మాట్లాడుతూ ఉపాధి, పారిశ్రామికీకరణ, సామాజిక భద్రతను ప్రధానమైన విషయాలుగా వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రస్తుత అస్థిరత, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా నిలుస్తూ, ‘బెంగాల్‌ను కాపాడదాం’ అనే నినాదంతో 22 రకాల ప్రధాన హామీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేస్తున్నామన్నారు. దీనిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంపై అత్యధికంగా దృష్టి సారించామని, తాము అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగంలోని ఖాళీలను రాబోయే ఐదేండ్లలోపు పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, ఆదాయం లేని ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి పని, సామాజిక భద్రత కల్పిస్తామని కూడా వాగ్దానం చేశారు. ఉపాధ్యాయుల నియామకాల విషయంలో, ఎస్‌ఎస్‌సీ, పీఎస్‌సీ లేదా మదర్సా సర్వీస్ కమిషన్ ద్వారా పారదర్శక నియామకాలు, ప్రతి ఏటా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, తృణమూల్ పార్టీలు భాష, మతం, కులం పేరిట చేస్తున్న విభజన రాజకీయాలకు వామపక్షాలే ఏకైక ప్రత్యామ్నాయమన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా, ప్రతి జిల్లాలో ప్రత్యేక ‘అభయ బహిని’ ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక బృందాల ద్వారా ఆదాయాన్ని పెంచాలని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధరను పెంచాలని, రైతుల కోసం ఆధునిక సహకార సంఘాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కుట్ర ద్వారా ముస్లిం ఓటర్లే కాకుండా, చాలా మంది హిందూ ఓటర్ల పేర్లను కూడా తొలగించారని ఆయన విమర్శించారు. మోతాబారి, కాలియాచక్‌లలో ఇటీవల జరిగిన పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘం చేస్తున్నది అన్యాయమన్నారు. గత 15 ఏండ్లలో తృణమూల్ ప్రభుత్వం రాష్ట్ర అప్పును రూ. 5లక్షల కోట్లకు పైగా పెంచిందని, అయితే 34 ఏండ్ల సుదీర్ఘ వామపక్ష పాలనలో అప్పు కేవలం రూ. 1.92 లక్షల కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు. ఇంత భారీ రుణ భారం ఎందుకు పెరిగిందో అధికార పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
మ్యానిఫెస్టోలో ముఖ్యమైన విషయాలు..
ప్రతి కుటుంబానికి ఒక శాశ్వత ఉద్యోగం.
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం, ప్రతి ఏటా పారదర్శకతతో ఎస్‌ఎస్‌సీ, సీఎస్‌సీ, పీఎస్‌సీలను తిరిగి నియమించడం.
భారీ, మధ్య తరహా పరిశ్రమలను తిరిగి తీసుకురావడానికి చొరవ, చిన్న. కుటీర పరిశ్రమల్లో దేశంలో మొదటి స్థానాన్ని పునరుద్ధరించడం.
కార్మికుల కనీస రోజువారీ వేతనం రూ.700, రాష్ట్రంలో 4 కార్మిక చట్టాలు వర్తించవు, పనిచేసే మహిళా కార్మికులు, ఉద్యోగుల కోసం శిశుసంరక్షణ కేంద్రాలు, ట్రాన్స్ జెండర్, క్వీర్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, కార్మికుల సామాజిక భద్రత, గౌరవం.
16 పంటలకు కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచడం.
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 20 శాతం, గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ట్యూషన్ ఫీజు మినహాయింపు, బడ్జెట్‌లో ఆరోగ్యానికి 10 శాతం కేటాయింపు.
విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిలిపివేయడం, ఆదాయపు పన్ను చెల్లించని వారికి – 100 యూనిట్ల వరకు విద్యుత్‌ను పూర్తిగా ఉచితంగా, 200 యూనిట్ల వరకు సగం ధరకు అందించడం.
మైక్రోఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు.
నదీ కోత నివారణకు సమర్థవంతమైన కార్యక్రమాలు, కాలువలు, బీళ్లు, చెరువులు, చిత్తడి నేలలు, నదుల పరిరక్షణకు కఠిన చట్టాలు.
అవినీతిపై రాజీలేని దర్యాప్తు, విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు కమిషన్ ఏర్పాటు.
ఐదేండ్లలోపు 20 లక్షల స్వయం సహాయక బృందాల ఏర్పాటు, తమన్నా, అభయలతో సహా బాధితులందరికీ న్యాయం.



