Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్టార్టప్‌ స్టేట్‌ 'తెలంగాణ'

స్టార్టప్‌ స్టేట్‌ ‘తెలంగాణ’

- Advertisement -

ఏఐ, లైఫ్‌ సైన్సెస్‌, ఫిన్‌టెక్‌, అగ్రిటెక్‌ సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి
భారతీయ విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి : కొలంబియా బిజినెస్‌ స్కూల్‌ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ పిలుపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్‌ స్టేట్‌ ‘తెలంగాణ’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో గల ప్రతిష్టాత్మక ‘కొలంబియా బిజినెస్‌ స్కూల్‌’లో ఆదివారం 21వ వార్షిక ‘ఇండియా బిజినెస్‌ కాన్ఫరెన్స్‌’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్షలు, పురోగతికి నిదర్శనమని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్‌ కారణంగానే హైదరాబాద్‌ గ్లోబల్‌ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), లైఫ్‌ సైన్సెస్‌, ఫిన్‌టెక్‌, అగ్రిటెక్‌ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సాంకేతికత, ఇతర సమస్యల పరిష్కారమే కాకుండా భవిష్యత్‌ అవసరాలకు తగినట్టు సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు, నిపుణులు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు
రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లనీ, దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్‌ సూచించారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తి, దేశాభివృద్ధి అనేది కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా, ప్రతి రాష్ట్రానికున్న ప్రత్యేక బలాలను వినియోగిం చుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ”భారతదేశం 28 ఇంజన్లు కలిగిన ఒక ‘ఫార్ములా-1’ రేసింగ్‌ కార్‌ లాంటిదని చెప్పారు. ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలి” అని ఆయన అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయని చెప్పారు. ఐటీ, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని అన్నారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.72 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుంచి దాదాపు 10 లక్షలకు చేరుకుందని చెప్పారు. హైదరాబాద్‌లో అమెజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందనీ, గూగుల్‌, ఆపిల్‌, మెటా, సేల్స్‌ ఫోర్స్‌, ఊబర్‌, మైక్రాన్‌ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని వివరించారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్‌ రాజధానిగా తెలంగాణ ఎదిగిందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -