భూమి నుంచి రికార్డు దూరంలో
1970లో అపోలో 13 కంటే 2,500 కి.మీ అదనం
10న పసిఫిక్ మహాసముద్రంలో
ల్యాండింగ్ అయ్యే అవకాశం : శాస్త్రవేత్తలు
న్యూయార్క్ : అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్ర కీలక దశలోకి చేరింది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించారు. వారిని తీసుకెళ్లిన ఒరాయన్ వ్యోమనౌక.. 4,06,773కి.మీ దూరం ప్రయాణించి అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా రికార్డు సృష్టించింది. 1970లో అపోలో 13 ప్రయాణించిన దూరం కంటే ఇది 2,500 కి.మీ అదనం కావడం గమనార్హం.ఈ క్రమంలోనే ‘లూనార్ ఫ్లైబై’ దశ చోటుచేసుకోనుంది. ఆ విన్యాసంతో ఒరాయన్.. చందమామను దాటి 6,400 కిలోమీటర్లు దూరం వెళుతుంది. ఈ క్రమంలో.. మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుడి రెండో పార్శ్వాన్ని వ్యోమగాములు క్లిక్ మనిపిస్తారు. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తి చేశాక ఈ వ్యోమనౌక భూమి వైపు మళ్లుతుంది. ఈ నెల 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.



