Tuesday, April 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసీఎంపీఎఫ్‌ చెల్లింపులో సింగరేణి అలసత్వం

సీఎంపీఎఫ్‌ చెల్లింపులో సింగరేణి అలసత్వం

- Advertisement -

బొగ్గు గని ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన నిర్వాసితులకు అండగా ఉండాల్సిన సింగరేణి యాజమాన్యం, నేడు వారి పొట్టకొట్టే పనిలో పడింది. వారి దయాదాక్షిణ్యాలపై ఆధార పడేలా చేస్తుంది. క్రాంట్రాక్టు డ్రైవర్ల వేతనాల నుంచి కోత విధిస్తున్న కోట్లాది రూపాయల సీఎంపీఎఫ్‌ నిధులను సకాలంలో జమ చేయకుండా, వారి భవిష్యత్తును ఆందోళనలో పడేసింది. కోర్టు తీర్పులను సైతం బేఖాతరు చేస్తోంది. సుమారు రూ.63కోట్ల సీఎంపీఎఫ్‌ బోర్డుకు చెల్లించకుండా కాలయాపన చేస్తోంది. రెండేళ్లుగా చెల్లించకపోవడం అలసత్వమా?లేక ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా? అద్దె వాహనాల నుంచి సర్వీసు ఛార్జీలు, టెండర్‌ డిపాజిట్లు వసూలు చేస్తున్న సంస్థ, కార్మికుల సామాజిక భద్రతను మాత్రం గాలికొదిలేయడం అన్యాయం. ప్రభుత్వరంగ సంస్థలకు ఆదర్శంగా ఉండవలసిన సింగరేణి కాంట్రాక్టు వ్యవస్థను బలోపేతం చేస్తూ శ్రమదోపిడీ చేస్తున్నది.

సింగరేణి యాజమాన్యం ప్రాజెక్టు అవసరాల కోసం భూములు తీసుకుంటున్నప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని అనేక వాగ్దానాలు చేస్తుంది. తీరా భూములు సేకరించిన తర్వాత పట్టించుకోవడం లేదు. అవకాశాల మేరకు భూ నిర్వాసితులకు పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వవలసిన సింగరేణి యాజమాన్యం పూర్తిగా విస్మరించింది. శాశ్వత పనిస్థలాల్లో, బొగ్గు ఉత్పత్తికి కీలకమైన ఆపరేషన్‌, ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాలలో సింగరేణి సంస్థనే వాహనాలు కొనుగోలు చేసి, భూ నిర్వాసితులను పర్మినెంట్‌ డ్రైవర్లు నియమించవలసి ఉండగా, అద్దెకు తీసుకున్న వాహనాల నుండి పిఎఫ్‌ కింద డబ్బులు మినహాయించుకొని సీఎంపీఓకు చెల్లించకపోవడం శోచనీయం.

సింగరేణి వ్యాప్తంగా సుమారు పదిహేను వందల అద్దె వెహికిల్స్‌ను వినియోగిస్తున్నారు. బొలోరాలు, 1, 2 టన్నుల సామర్థ్యం గల క్యాం పర్స్‌, 3, 6 టన్నుల డీసీఎం వ్యాన్స్‌ అవసరాల ప్రాతిపదికన సింగరేణి సంస్థ అద్దెకు తీసుకుంటున్నది. భూ నిర్వాసితులకు మొదటి ప్రాధాన్యత. ఎక్స్‌ ఎంప్లాయిస్‌ డిపెండెంట్స్‌కు రెండవ ప్రాధాన్యతగా రూ.579 నాన్‌ రిఫండేబుల్‌ దరఖాస్తు తో కావలసిన డాక్యుమెంట్లు తీసుకొని వెహికిల్స్‌ను సింగరేణి యాజమాన్యం అద్దెకు పెట్టుకుంటున్నది. ఇయండి మినహాయింపు ఇస్తున్నది. టెండర్‌ ఖరారైతే, సర్వీస్‌ డిపాజిట్‌ రూ.ఐదు వేలు చెల్లించాలి. మూడవ ప్రాధాన్యతగా ఇతరుల నుండి టెండర్ల ద్వారా వెహికిల్స్‌ను అద్దెకు తీసుకుంటుంది. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సిసిఎల్‌) భూ నిర్వాసితుల నుండి యూనిట్‌ రేట్‌ పద్ధతిలో వాహనాలను అద్దెకు తీసుకుం టుంది. సీఎంపీఎఫ్‌ (కోల్‌మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) పెన్షన్‌ కాంట్రిబ్యూషన్ల కొరకు కాంట్రాక్టర్‌ వాటాగా వేతనంపై 19.72శాతం (12శాతం సీఎంపీఎఫ్‌ + 7శాతం పెన్షన్‌ + 0.72శాతం అడ్మిన్‌ ఛార్జీలు).

కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ పథకం (సీఎంపీఎస్‌) 2018 అక్టోబర్‌ 1, నుండి అమలులోకి వచ్చిన నిబంధన ప్రకారం, పెన్షన్‌ ఫండ్‌ కోసం ఉద్యోగి, యజమాని చెరో 7శాతం చొప్పున బేసిక్‌, వేరియబుల్‌ డియర్‌నెస్‌ అలవెన్స్‌ (విడిఎ) కాంట్రిబ్యూషన్‌ చెల్లించాలి. సీఎంపిఎఫ్‌ నిమిత్తం డ్రైవర్‌ వేతనంలో12శాతం +పెన్షన్‌ కాంట్రిబ్యూషన్ల కొరకు 7శాతం మొత్తం 38.72శాతం. ఆర్థిక సంవత్సరము 2022-23 నుండి నేటి వరకు సింగరేణి యాజమాన్యం ఓనర్‌/ ఓనర్‌ కం డ్రైవర్‌ వాహనల అద్దె చెల్లింపుల నుంచి మినయించుకుంటున్నది. కానీ, సింగరేణి యాజ మాన్యం సీఎంపిఎఫ్‌ఓకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే చెల్లింపులు చేసింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన డబ్బులను సింగరేణి యజమాన్యం సీఎంపిఎఫ్‌ఓకు చెల్లించలేదు.
సింగరేణి వ్యాప్తంగా సుమారు 1500 వెహికిల్స్‌ పైన మూడువేల మంది డ్రైవర్స్‌ పనిచేస్తున్నారు.

వీరికి 8 గంటల పని దినానికి రూ.760 చొప్పున నెలకు 30 రోజులకు రూ.22,800 జీతం. సీఎంపిఎఫ్‌ కాంట్రాక్టర్‌, డైవర్‌ వాటా 24.72శాతం, పెన్షన్‌ ఫండ్‌ కాంట్రాక్టర్‌, డ్రైవర్‌ 14శాతం చొప్పున డ్రైవర్ల వేతనము నెలకు రూ.22,800 పైన 38.72శాతం రూ. 8828.16 ఐ 3000 మంది డ్రైవర్స్‌ అనుకున్న ప్పటికీ, నెలకు రూ.2 కోటి 64 లక్షల 84 వేల 480. రెండేళ్లకుగాను 63 కోట్ల 56 లక్షల 27 వేల 520 రూపాయలు సీఎంపిఎఫ్‌ఓకు సింగరేణి యాజమాన్యం చెల్లించవలసి ఉన్నది. డ్రైవర్‌ కం ఓనర్‌ పిఎఫ్‌ ఎలిజిబిలిటీపై హైకోర్టులో కేసు నడిచింది. తెలంగాణ హైకోర్టు తీర్పులు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ నియమించిన అద్దె వాహనాల డ్రైవర్లు కోల్‌ మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం కింద ప్రావిడెంట్‌ ఫండ్‌ ప్రయోజనాలకు అర్హులని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పులు (సిఎమ్‌పిఓ వర్సెస్‌ ఎస్‌సిసిఎల్‌/కాంట్రాక్టర్లు) జి.వీరయ్య వర్సెస్‌ ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (2022) కంపెనీ అధికారుల రవాణా కోసం కాంట్రాక్టర్లు నియమించుకున్న ప్రయివేటు వాహనాల డ్రైవర్లు 1948 నాటి బొగ్గు గనుల ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇతర నిబంధనల చట్టం పరిధిలోకి వస్తారా లేదా అనే విషయాన్ని తెలంగాణ హైకోర్టు పరిశీలించింది.

అటువంటి డ్రైవర్లు ఈ చట్టం పరిధిలోకి రారనే వాదనను తిరస్కరిస్తూ, వారు ఈ చట్టం పరిధిలోకి వస్తారని కోర్టు ధృవీకరించింది. రిట్‌ పిటిషన్‌ నెం.29331 ఆఫ్‌ 2013 (కె. వెంకటేశ్వర్లు వర్సెస్‌ సిఎమ్‌పిఓ): కంపెనీకి (ఎస్‌సిసిఎల్‌) అందించిన వాహనం డ్రైవర్‌ కంపెనీ వ్యాపారానికి సంబంధించి ఉన్నందున, వారు సిఎమ్‌పిఎఫ్‌ ప్రయోజనాలకు అర్హులని నిర్ధారించింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ అర్హతపై ఉద్యోగి నిర్వచనం ప్రకారం సంస్థ పనికి సంబంధించి, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, వేతనాల కోసం నియమించబడిన ఏ వ్యక్తి అయినా ఇందులో చేర్చబడతారని పేర్కొంది. తర్వాత సుప్రీంకోర్టు కూడా సీఎంపీఓఓకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ కాలంలో సింగరేణి యాజమాన్యం వాహనాల అద్దె చెల్లింపుల నుండి 15శాతం అడహాక్‌ పేమెంట్‌ కింద కట్‌ చేసింది.

సింగరేణి యాజమాన్యం సీఎంపీిఎఫ్‌ ఓకు చెల్లింపులు కాలయాపన చేయడం వలన 25శాతం పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ఈ కాలంలో పనిమానేసిన డ్రైవర్లకు సీఎంపిఎఫ్‌ విత్‌డ్రా చేసుకోలేక, లోన్లు, ఇతర సౌకర్యాలు పొందలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సీఎంపీఎఫ్‌ చందాదారుడుగా ఉండి సర్వీస్‌ కాలంలో మరణించిన సందర్భంలో వర్తించే పథకం కోల్‌మైన్స్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (సీఎంఈ డిఎల్‌ఐ) ఈ కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలు నష్టపోయాయి. ఈ పథకం కింద గరిష్టంగా రూ.ఏడు లక్షల వరకు చెల్లిస్తారు. ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం వెంటనే సీఎం పీఓకు చెల్లించవలసిన డబ్బులు చెల్లించి, డ్రైవర్ల పిఎఫ్‌ ఖాతాలలో జమయ్యేవిధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

గీట్ల ముకుందరెడ్డి
9490098857

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -