తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసులో మధురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
మదురై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన (2020 నాటి) సత్తాంకుళం లాకప్ డెత్ కేసులో మధురైలోని ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వ్యాపారి జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేయగా, విచారణ సమయంలో ఓ పోలీసు అధికారి కోవిడ్ కారణంగా మృతిచెందారు. 2020 జూన్19న జయరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కుమారుడు బెనిక్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తన తండ్రిని కొట్టడాన్ని అడ్డుకున్నాడు.
దీంతో పోలీసులతో ఎలా ప్రవర్తించాలో బుద్ధి చెబుతాం అంటూ వారిద్దరినీ రాత్రంతా విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుధ్య కార్మికుడితో రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ వాంగ్మూలం, మెడికల్ రిపోర్ట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం సుమోటోగా స్పందించి, పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రాథమికంగా నిర్థారించింది. అనంతరం అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. సెప్టెంబర్ 2020లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయగా, సోమవారం న్యాయస్థానం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది.



