Tuesday, April 7, 2026
E-PAPER
Homeబీజినెస్రిలయన్స్‌ షేర్‌ క్రాష్‌

రిలయన్స్‌ షేర్‌ క్రాష్‌

- Advertisement -

ఇంట్రాడేలో 5 శాతం పతనం
రూ.62,385 కోట్లు ఆవిరి

ముంబయి : అధిక చమురు ధరలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ షేర్‌కు సెగ పుట్టిస్తున్నాయి. సోమవారం సెషన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేరు ఓ దశలో 5 శాతం మేర కుప్పకూలింది. మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో షేరు ధర 3.41 శాతం తగ్గి రూ.1304.75కు పరిమితమయ్యింది. ఈ భారీ పతనం వల్ల ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ కేవలం ఒక్క రోజులోనే రూ.62,384 కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయింది. ఇంతక్రితం సెషన్‌లో రూ.18.28 లక్షల కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ఈ పతనం తర్వాత రూ.17.65 లక్షల కోట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో షేరు ధర రూ.1290 స్థాయికి పడిపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటడమే రిలయన్స్‌ షేరు పతనానికి ప్రధాన కారణమని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డబ్ల్యుటిఐ క్రూడ్‌ ధర ఏకంగా 115 డాలర్ల గరిష్టాన్ని తాకడం, చమురు సరఫరాకు కీలకమై హార్ముజ్‌ జలసంధి గుండా రవాణా 10 శాతానికి పడిపోవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా కార్పొరేట్‌ సంస్థల లాభాల మార్జిన్లు దెబ్బతింటాయనే ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఎనర్జీ ఆధారిత కంపెనీ కావడంతో రిలయన్స్‌ వంటి స్టాక్స్‌పై ఈ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఇరాన్‌తో అమెరికా యుద్ధాన్ని ముగించుకోనుందనే వార్తలు, అంచనాల్లో సోమవారం భారత మార్కెట్లు రాణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 787 పాయింట్లు లేదా 1.07 శాతం పెరిగి 74,106.85 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 255 పాయింట్లు లేదా 1.12 శాతం లాభపడి 22,968 వద్ద నమోదయ్యింది. నిప్టీలో బ్యాంక్‌, రియాల్టీ రంగాలు 2 శాతం చొప్పున లాభపడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -