Tuesday, April 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులాబీయింగ్‌ చేస్తేనే రాయితీలు!

లాబీయింగ్‌ చేస్తేనే రాయితీలు!

- Advertisement -

– భోరుమంటున్న పారిశ్రామికవేత్తలు
– పరిశ్రమలు పెట్టి పరేషాన్‌ అవుతున్నామని ఆవేదన
– ప్రోత్సాహకాల బకాయిలు రూ.9,750 కోట్లు
– చితికిపోతున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలు
– తాజాగా పీక్‌ అవర్‌ కరెంటు చార్జీలు పెంపు


‘రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తాం… నిరుద్యోగాన్ని రూపుమాపుతాం…దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తాం…’ ఇవి అనేక వేదికలపై ప్రభుత్వ పెద్దలు చెప్పే ఆర్భాటపు మాటలు. వినేందుకు వింపుగా ఉన్నాయని, ఆ మాటలు నమ్మి బ్యాంకుల్లో నుంచి అప్పులు తెచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా మారారో… రెండేండ్లలోనే ఆస్తులమ్ముకోవడం ఖాయం! రాష్ట్రంలో పారిశ్రామిక తిరోగతి అంత దారుణంగా ఉంది. దేశంలో ఎక్కడా లేనన్ని ప్రోత్సాహకాలు పరిశ్రమలకు ఇస్తున్నామనీ, తమ పాలసీలు అత్యంత అద్భుతాలనీ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) పరిశ్రమల యజమానుల పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ఏ పారిశ్రామికవాడ (ఐలా)లోకి వెళ్లి వాకబు చేసినా, యజమానులు ఎక్కడా సంతోషంగా కనిపించట్లేదు. కొత్త పరిశ్రమలకు రాయితీల సంగతి దేవుడెరుగు…దశాబ్దాలుగా ఎస్టాబ్లిష్‌ అయిన పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి రావల్సిన ప్రోత్సాహకాలు ఏండ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు అక్షరాలు దాదాపు రూ.9,650 కోట్లు. వాటిలో బేవరేజ్‌ సంస్థలకు ఇవ్వాల్సిన సొమ్ము దాదాపు రూ.3,900 కోట్లు. ఈ సొమ్ము కేవలం ఆ సంస్థలకే వెళ్తుందనుకుంటే పొరపాటు. బేవరేజెస్‌ సంస్థలకు అనుబంధంగా అనేక చిన్న పరిశ్రమలు ఉన్నాయి. వాటికి కూడా ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. ఇవి కాకుండా ఇతర ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు దాదాపు రూ.5,750 కోట్లు. వీటిలోనే 2016 నుంచి పరిశ్రమలకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.4,250 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందించేందుకు ఏటా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నది. కానీ ఆ కేటాయింపుల్లో 30 శాతం కూడా విడుదల చేయట్లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమల ప్రోత్సాహక బకాయిల విడుదల కోసం రూ.1,730 కోట్లు కేటాయించారు. కానీ విడుదల చేసింది కేవలం రూ.450 కోట్లు మాత్రమే. అవి కూడా భారీ ఎత్తున లాబీయింగ్‌ చేసుకోగలిగిన కంపెనీలకే ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు పదేళ్లుగా ఒక్క రూపాయి కూడా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో అనేకసార్లు ఈ అంశాన్ని పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పారిశ్రామికశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అనేక వినతిపత్రాలు సమర్పించారు. చూస్తాం…చేస్తాం అనే తాత్కాలిక ఉపశమన మాటలే తప్ప, రూపాయి విడుదల చేయట్లేదని పారిశ్రామికవేత్తలు మొత్తుకుంటు న్నారు. పరిశ్రమలు పెట్టేదాకా ఒకమాట, ఆ తర్వాత పరిస్థితులు మరోలాగా ఉంటున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా విదేశీ పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడుల కోసం ఆహ్వానించడం, వాళ్లు వచ్చాక ఇక్కడ చుక్కలు చూపించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాల్లో కనీసం 30 శాతం కూడా గ్రౌండ్‌ కాలేదని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఇప్పటికే ఎస్టాబ్లిష్‌ అయిన పారిశ్రామికవాడల్లో విచారణ చేస్తే, అనేక నెగటివ్‌ అంశాలు వెల్లడి అవుతున్నాయి. ప్రభుత్వ హామీల్లోని డొల్లతనం, పెండింగ్‌ బకాయిలు, ప్రోత్సాహకాల ఎగవేత వంటి అనేక విషయాలు బయటపడుతున్నాయి. దీనితో కొత్త పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పీక్‌ అవర్‌ పేరుతో పరిశ్రమలకు సరఫరా చేసే కరెంటు చార్జీలను భారీగా పెంచేసింది. కానీ పరిశ్రమలకు ఇస్తామన్న కరెంటు సబ్సిడీ సొమ్మును మాత్రం ఏండ్ల తరబడి పెండింగ్‌లోనే పెట్టారు.
అంతా డొల్లే!
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పాలసీ (2024-2029) ప్రకారం ఈ ఐదేండ్లలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) అభివృద్ధి, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాల కోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇటీవలే ఈ పాలసీలో మరికొన్ని సవరణలు చేశారు. పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తామనే ప్రకటనలు ఆకర్షణీయంగా ఉన్నా, వాటిని పొందేందుకు రూపొందించిన విధివిధానాలు, అర్హతలు చాలా కఠినంగా ఉన్నాయని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు.

ఆర్థిక రాయితీల్లో భాగంగా సాధారణ కేటగిరీ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు పెట్టుబడిలో రాయితీగా 25 శాతం లేదా గరిష్టంగా రూ.30 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క కంపెనీకి ఇవ్వలేదు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీని 50 శాతం లేదా గరిష్టంగా రూ.కోటి ఇస్తామని ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు 20 శాతం రాయితీ లేదా గరిష్టంగా రూ.20 లక్షలు ఇస్తామన్నారు. కార్యరూపంలోకి రాలేదు.

పారిశ్రామికవేత్తలకు ఇస్తామన్న పావలా వడ్డీ రాయితీలు కాగితాల్లోనే ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు వారు తీసుకొనే రుణాలపై 3 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ కల్పిస్తామని పాలసీలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా అమలైన దాఖలాలు లేవు.
పరిశ్రమ ప్రారంభించిన మొదటి ఐదేండ్ల వరకు వందశాతం రాష్ట్ర జీఎస్టీని రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరికీ ఇచ్చిన దాఖలాలు లేవు.

రాష్ట్రంలో కొత్తగా ఐదు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో మహిళలకు పదిశాతం, ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు భూమి గుర్తింపు పనులే ప్రారంభం కాలేదు.
పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలు భూమి కొనుగోలు లేదా లీజుకు తీసుకుంటే వందశాతం స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిబంధన గతంలోనూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ రాయితీని అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చారు.

పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఐదేండ్ల వరకు యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున విద్యుత్‌ రాయితీ ఇస్తామని ప్రకటించారు. 2016 నుంచి వీటిని పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన దాఖలాలు లేవు.

కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల కోసం రూ.100 కోట్లతో యంత్రం ఫండ్‌ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధులు కేటాయింపుల్లోనే ఉన్నాయి. విడుదల కాలేదు.

టాటా సంస్థ సహకారంతో రాష్ట్రంలోని ఐటీఐలను రూ. 2,400 కోట్లతో అప్‌గ్రేడ్‌ చేసి, పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని తయారు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి రాలేదు. ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకుంటే ఐటీఐల నుంచి వచ్చే విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ పెద్ద సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు.

పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ కొనుగోళ్లలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రాధాన్యత ఇస్తామని విధానపత్రంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వ కొనుగోళ్ల టెండర్లను బహుళజాతి కంపెనీలే దక్కించుకుంటున్నాయి. శిల్పారామం వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) ప్లాట్‌ఫారాలకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ఉత్పత్తులను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. ఉత్పత్తిదారులకు ఆయా వెబ్‌సైట్‌ల అడ్రస్‌లు ఇచ్చేసి ‘మమ’ అనిపించేశారు. వాటిలో రాష్ట్ర ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ఉత్పత్తులకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు లేకపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -