అబద్దాలు ప్రచారం చేసి రాజకీయ పబ్బం సరికాదు

 Spread lies Political party is not correct– బ్యాంకులను దోచిన నీరవ్‌మోడీ ప్రధానికి బంధువైనట్టేనా?
– నా ఇంటి పేరున్న వ్యక్తి ఉంటే మా బంధువేనా?
– 20ఏండ్ల రాజకీయజీవితంలో ఒక్క తప్పు చేయలేదు
–  కరీంనగర్‌ మాజీ పార్లమెంటు సభ్యులు :బోయినపల్లి వినోద్‌ కుమార్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నిజం గడపదాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ అన్న రీతిలోనే తనపై వచ్చిన తప్పుడు వార్తలు, ఆరోపణలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయని, ఇంత అసత్యాలు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం సరికాదని కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. బ్యాంకులను దోచి విదేశాలకు పారిపోయిన నీరవ్‌మోడీ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీకి బంధువు అవుతారా అంటూ ప్రశ్నించారు. తన 20ఏండ్ల రాజకీయ జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదని, విలువలతో కూడిన రాజకీయమే చేశానని అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రతిమా హోటల్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ జెన్‌ కోలో సీఎండీ ప్రభాకర్‌రావు అదే శాఖలో బోయినిపల్లి సరితరావుకు ఉద్యోగం ఇచ్చారని, నెలకు రూ.1.50లక్షల జీతభత్యాలు ఇస్తున్నారని, ఆ యువతి తన బంధువు అని మాట్లాడటంతోపాటు సోషల్‌మీడియాలో ప్రచారం చేశారని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న తన ఛానెల్‌లో కూడా ప్రసారం చేశారన్నారు. ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు’ బీజేపీ, కాంగ్రెస్‌ వాళ్లతో సహా కొందరు సోషల్‌ మీడియా వాళ్ళు కూడా ద్రుష్పచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన మిత్రులు, బంధువులు ఫోన్లు చేశారని తెలిపారు. కనీసం సరితారావు అనే పేరుతో తన బంధువుల్లో కూడా ఎవరూ లేరని, ఈ విషయాన్ని నిర్ధారించుకోకుండా, తన వివరణ తీసుకోకుండా తప్పుడు ప్రసారాలు చేయడం దారుణమన్నారు. దీనిపై బండి సంజయ్.. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రత్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, బండి సంజరు, అతడి అనుచరులు ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారం చేయడం సరికాదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ సర్దార్‌ రవిందర్‌ సింగ్‌, మేయర్‌ సునీల్‌ రావు, సిరిసిల్ల జడ్పీ వైస్‌ చైర్మెన్‌ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ఏనుగు రవిందర్‌ రెడ్డి, బీఆర్‌ఎల్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Spread the love