సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల బాగోగులు చూసుకుంటారు. అలాగే వారికి ఆసక్తి ఉన్న విషయాల్లో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక పిల్లలు తమ ఇష్టాలు తప్ప తల్లిదండ్రుల ఆసక్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇక తల్లి అయితే తమకు అన్నీ చేసిపెట్టడానికే ఉందని భావిస్తారు. కానీ ఈ కూతురు అలా కాదు. తన తల్లి ఆసక్తిని గమనించి సాహిత్య రంగంలోకి ప్రోత్సహించింది. తల్లిలోని నైపుణ్యాన్ని గుర్తించి సాహిత్య కారిణిగా తీర్చిదిద్దింది. ఆ తల్లే వల్లూరు లీలావతి. కూతురిచ్చిన ప్రోత్సహాంతో సాహిత్య రంగంలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నా కలానికి బలం నా కూతురు” అని సగర్వంగా చెబుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
వల్లూరు లీలావతి బాపట్లలో పుట్టి పెరిగి పెండ్లి తర్వాత గుంటూరులో స్థిరపడ్డారు. తల్లి బొడ్డుపల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి నరహరిశాస్త్రి. ఇద్దరు అన్నలు, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లతో ఆడిపాడిన బాల్యం ఆమెది. బాల్యంలోని తన అనుభూతులను, అనుభవాలను చెబుతూ ‘నాకు తొమ్మిదేండ్లు వచ్చే వరకు మహారాష్ట్రలోని చంద్రపూర్ (చాందా)లో మా అమ్మానాన్నలతో పెరిగాను. అప్పటికే హైస్కూల్ విద్యకు వచ్చిన అన్నలు, అక్క.. బాపట్లలో అమ్మమ్మగారింట్లో ఉంటూ చదువుకునేవారు. నేను మరాఠీ మీడియంలో నాల్గవతరగతి దాకా చాందాలోనే చదివాను. అక్కడి జనతా మహావిద్యాలయంలో మా నాన్న ఇంగ్లీషు ప్రొఫెసర్. అయితే ఇంట్లో మా అమ్మానాన్నలు ప్రతిదీ తెలుగులో వివరించటం వల్ల నాకు తెలుగు బాగా వచ్చేది. మరాఠీతో బాటు తెలుగు, ఆంగ్లంలో పరిజ్ఞానం పొందాను. మా అమ్మ ఆ రోజుల్లోనే ఎయిత్ ఫారం చదివింది. తెలుగు, సంస్కృత సామెతలు వివరించేది. అలా చిన్నతనం నుండే తెలుగుభాషపై పట్టు సాధించాను’ అంటారు ఆమె.
యాభై రెండేండ్లకు ఎమ్మే
హైస్కూలు చదువుకోసం తన పదవ ఏట లీలావతి బాపట్లకు తిరిగి వచ్చారు. మేనమామ ప్రోత్సాహంతో ఐదవ తరగతిలో ఉన్నప్పటి నుండి తన అక్కతో కలిసి భరతనాట్యం నేర్చుకున్నారు. నేర్చుకుంటూనే పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇంటర్మీడియట్ పూర్తయ్యే సరికి హిందీ పరీక్షలు మొత్తం (రాష్ట్ర,భాషాప్రవీణ వరకు) పూర్తి చేశారు. ఆమెలో క్రమంగా సాహిత్య బీజాలు మొలకెత్తాయి. పి.జి.లో కవితలు రాయడం మొదలుపెట్టారు. తన పంతొమ్మిదివ ఏటనే ఆంధ్రా యూనివర్సిటీ నుండి లీలావతి ఎమ్మే తెలుగు పట్టా పొందారు. సంస్కృత భాషపై ఉన్న మక్కువతో తిరుపతి సంస్కృత విద్యాపీఠం నుంచి తన యాభై రెండవ ఏట సంస్కృతంలో ఎమ్మే పట్టాపొందిన విధూషి లీలావతి.
కూతురు ప్రోత్సాహంతో…
పెండ్లి, సంసారం బరువు బాధ్యతల మధ్య భర్త ప్రోత్సాహంతో కలం కదిలినా, భావాలు పొంగినా, సమయాభావం చేత చురుగ్గా రాయలేకపోయేవారు. అయితే కూతురు హారిక యుక్త వయసుకు వచ్చిన తర్వాత తల్లిలోని ప్రతిభను, ఆసక్తిని గుర్తించింది. ‘రచనలు చేయమ్మా’ అంటూ ప్రోత్సహించింది. అలా లీలావతి తన 40వ ఏట తిరిగి ఆమె కలంలో చురుకుదనం పెరిగింది. అధ్యాపకురాలిగా పని చేస్తూనే కవితలు, వ్యాసాలు, పాటలు, రేడియోకి రాస్తూ అందరి మెప్పు పొందారు. ఆమె రచనలు చూసిన మిత్రులు, ప్రధానోపాధ్యాయులు, తోటి టీచర్లు ఎంతో ప్రోత్సహించేవారు. స్కూలు, కాలేజీ మ్యాగజైన్లలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆమె వ్యాసాలు, కవితలు, పదవినోదం, పాటలు వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు వెలుగు చూశాయి.
రాశి కాదు వాసి ముఖ్యం
ప్రైవేటు కళాశాలల్లో ఉద్యోగం చేసిన ఆమె కరోనా కాలంలో సాహిత్యానికి సంబంధించిన వాట్సప్ గ్రూప్స్‌ల్లో చేరారు. తానా, ఆటా వంటి సంస్థలు నిర్వహించే పోటీల్లో పాల్గొని అనేక పురస్కారాలు పొందారు. శ్రీ కాటే, పాండురంగవిఠల్ వంటి గొప్పవారి ప్రోత్సాహంతో తెలుగు, హిందీ భాషల్లో 900 పంచపదులు రాశారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. రచయిత తన భావాల్ని స్పష్టంగా వ్యక్తపరుస్తూ, సమాజానికి హితం గూర్చే రచనలు చేస్తూ ఉండటం నేడు చాలా అవసరమని, వేయిమందిలో ఒక్కరికైనా ఆ రచనలు సహాయపడగలవని తన నమ్మకం అంటారామె. ‘ఎన్ని పుస్తకాలు ప్రచురించాం అన్నది కాదు ముఖ్యం, అవి పాఠకుడిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేదే ముఖ్యం’ అనే ఆమె మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి.
ఎగిరే ఏనుగు
ఇక ఆమె కూతురు హారిక ఆకాశవాణిలో ప్రసార కార్యనిర్వాహక అధికారి. అలాగే రచయిత్రి కూడా. ‘నా స్ఫూర్తిదాత నా కూతురు’ అంటారు ఆ తల్లి. హారిక ఉద్యోగరీత్యా లీలావతి కూడా 2021 నుండి 2025 వరకు అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్నారు. అందమైన ఆ ప్రకృతి ఒడిలో పరవశించిన ఆమె హృదయంలో ఎగసిపడిన భావాలతో ఎన్నో రచనలు వెలువడ్డాయి. అక్కడే తన తొలిపుస్తకం ‘ఎగిరే ఏనుగు’ ఆవిష్కరణ జరగటం తనకు మధురానుభూతి అంటారామె. తమిళం మూలమైన ఆ పుస్తకాన్ని ఆంగ్లం నుంచి తెలుగులోకి కరోనా సమయంలోనే అనువదించారు. ‘తెలుగు సామెతలు – అర్థాలు’ అనే మరొక పుస్తకం కూడా ప్రచురించబడింది.
పలు సాహిత్య వేదికల్లో…
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ఆమె ఆన్లైన్ క్లాసులలో సంస్కృతం బోధిస్తూ బిజీగా ఉన్నారు. 50 ఏండ్ల పాటు అధ్యాపకురాలిగా అందరి మెప్పు పొందిన లీలావతి సురభారతీ సమితి, భాగ్యనగరం (సంస్కృత భాషా సమూహాలు), సాహితీ సిరికోన, అక్షరయాన్ తెలుగు రచయిత్రుల సమూహం, వాగ్దేవి సాహితీ వేదిక (తెలుగు సమూహం), పంచపది కవన వేదిక (తెలుగు, హిందీ సమూహ)లో ఉంటూ విస్తృతమైన సాహిత్యసేవ చేస్తున్నారు. హారికతో పాటు డా. బింబాధర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆయన రేడియాలాజిస్టు. కొడుకు, కూతురు ఇద్దరూ ఆమె సాహితీ వ్యాసంగంలో అండదండగా, వెన్నుదన్నుగా ఉంటారు. ఇలా పిల్లల ప్రోత్సాహంతో తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్న ఆ తల్లి భవిష్యత్తులో మరెన్ని రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ…
– అచ్యుతుని రాజ్యశ్రీ



