అన్నింటిపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటా..!
ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్ట్ జడ్జి స్వర్ణకాంత శర్మ వ్యాఖ్యలు
తన పిటిషన్‌పై వాదించేందుకు కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘నేను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని (రెక్యూసల్) ఇంకెవరైనా అప్లికేషన్ ఫైల్ చేయాలనుకుంటే చేయండీ. వీటన్నింటిపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటా’ అని ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ చేపడుతోన్న ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యాఖ్యానించారు. ఈ రెక్యూసల్ పిటిషన్లపై సమాధానం చెప్పాలని సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ… తదుపరి విచారణను ఆయన ఏప్రిల్ 13కు వాయిదా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్, కవిత, సిసోడియాలతో పాటు మొత్తం 23 మందికి ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 27న క్లీన్చిట్ ఇచ్చింది. అలాగే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు తీరును తప్పుబడుతూ… ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(ఐఓ)పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థను ఆదేశించింది. ఈ తీర్పున సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో మార్చి 9న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ, 23 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా, తటస్థంగా జరగలేదని ఆరోపిస్తూ, ఈ కేసు విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని కేజ్రీవాల్, సిసోడియాలు హైకోర్టు సీజేకు లేఖలు రాశారు. దీనిపై స్పందించిన హైకోర్టు సీజే జస్టిస్ డికె ఉపాధ్యాయ, కేసు విచారణ బదిలీ అభ్యర్థనను తిరస్కరించారు. రోస్టర్ ప్రకారం కేసు విచారణ జరుగుతుందని, విచారణ నుంచి తప్పుకోవాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని కేజ్రీవాల్, సిసోడియా, మరికొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాగా… సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ మరోసారి సోమవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీబీఐ తరపున తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ… కోర్టు నాటకాలకు వేదిక కాదన్నారు. కేజ్రీవాల్ సహా మరికొంత మంది దాఖలు చేసిన రెక్యూసల్ పిటిషన్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘కోర్టు నాటకాలకు వేదిక కాదు. ఒక వేళ కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించాలని అనుకుంటే, ఆయన తన న్యాయమూర్తిని తొలగించుకోవాలి. అలాగే కేజ్రీవాల్ చేస్తోన్న ఆరోపణలు అల్పమైనవి, కోర్టు ధిక్కారానికి సమానం’ అని వాదించారు. ‘దేశంలో కొందరు అందరిపై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని వృత్తిగా పెట్టుకున్నారు. దానిని తీవ్రంగా పరిగణించాలి. ఇది వ్యవస్థపై చేసిన ఆరోపణ, ఆ వ్యవస్థకు అందరూ మద్దతు ఇవ్వాలి’ అని కోరారు. విచారణ నుంచి వైదొలగాలన్న అప్లికేషన్‌పై సీబీఐ తరపు స్పందన నోట్ రూపంలో సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. రెక్యూసల్కు సంబంధించి కేజ్రీవాల్‌తో పాటు మరో ఏడుగురు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నట్టు గుర్తు చేశారు.
కోర్టుకు కేజ్రీవాల్
ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు కేజ్రీవాల్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. ‘ రెక్యూసల్ పిటిషన్‌పై స్వయంగా నేనే వాదనలు వినిపిస్తాను. న్యాయవాదిని తొలగించే అంశంలో చట్టరపమైన హక్కులను వినియోగించుకుంటాను. నేను స్వయంగా హాజరుకావడం వల్ల హైకోర్టు పోర్టల్‌లో ఈఫౖౖెల్ చేయలేకపోయాను. కాబట్టి నా దరఖాస్తును రికార్డులోకి తీసుకోండి’ అని కేజ్రీవాల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. మరోవైపు ప్రతివాదుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది షాదన్ ఫరాసత్, రెక్యూసల్ (న్యాయవాదిని బదిలీ చేయాలన్న పిటిషన్) విషయంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకున్నట్టు కోర్టుకు నివేదించారు. ఈ వాదనలపై స్పందించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ, మరెవరైనా రెక్యూసల్ పిటిషన్లు వేయాలనుకుంటే వేయాలని, అన్నింటిపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. అలాగే ప్రతివాదుల అప్లికేషన్లపై సీబీఐకి నోటీసులు జారీ చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులు కేజ్రీవాల్ సహా ఇతరులకు మరింత సమయం ఇవ్వాలా? వద్దా ? అనే అంశంపై ఉత్తర్వులు జారీ చేస్తానని వెల్లడించారు. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేశారు.
ఇంకెవరైనా రెక్యూసల్ పిటిషన్లు వేస్తారా?
- Advertisement -
- Advertisement -



