చెన్నై : తమ రాష్ట్రంపై హిందీని రుద్దడాన్ని ఎప్పటికీ అంగీకరించమని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం స్పష్టం చేశారు. తిరువయ్యూరు జిల్లాలో డీఎంకే అభ్యర్థి దురై చంద్రశేఖరన్ తరపున సోమవారం ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ రాష్ట్రం త్రిభాషా సూత్రాన్ని ఎప్పటికీ అంగీకరిందని, తమిళ, ఆంగ్ల ద్విభాషా విధానాన్ని అసుసరిస్తుందని అన్నారు. భాషా వివాదంపై ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను విమర్శించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విరుచుకుపడ్డారు. జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) అమలు చేయాలని కేంద్రం తమిళనాడుపై ఒత్తిడి చేస్తోందని, తద్వారా రాష్ట్రంపై హిందీని రుద్దేందుకు యత్నిస్తోందని అన్నారు.
ఈ విధానాన్ని అంగీకరించడమంటే, తమిళనాడుపై హిందీని రుద్దేందుకు కేంద్రానికి అనుమతి ఇవ్వడమే అవుతుందని అన్నారు. తిరువయ్యూరు నుంచి చంద్రశేఖరన్ ఆరవసారి ఘన విజయం సాధించేలా చూడాలని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 2021 ఎన్నికల్లో తంజావూరు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాల్లో విజయం సాధించామని, ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయాన్ని సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను అనుభవం లేని వాడిగా ముద్రవేసిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పడి పళనిస్వామిపై ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తన ఉనికిని నిలబెట్టుకునేందుకు నాయకుల కాళ్లపై పడే’ పళనిస్వామి లాంటి అనుభవం మాత్రం తనకు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
హిందీని రుద్దడాన్ని అంగీకరించం : ఉదయనిధి స్టాలిన్
- Advertisement -
- Advertisement -



