– క్వింటాల్ కు రూ.700నుంచి 800 నష్టపోతున్న రైతన్నలు..
– ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతల డిమాండ్
నవతెలంగాణ కుభీర్ : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని మధ్యవర్తులకు అమ్మి ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు. ప్రస్తుతం మక్కా పంట చేతికి రావడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దళారులకు వరంగా మారింది. ఈ ఏడాది కుబీర్ మండల వ్యాప్తంగా 15 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగైనట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం పంట చేతికి వస్తున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ లో క్వింటాలకు రూ.1700 ధర ఇవ్వడంతో రైతులు క్వింటాలకు 700 నుండి 800 వరకు నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం పంటలు ప్రైవేట్ లో విక్రయించిన తర్వాతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మండిపడ్డారు. ఈ విషయం ఇటీవల శనగ కొనుగోలు ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే రామారావు పటేల్ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోతుందని రైతులు మండిపడుతున్నారు. మరోపక్క అకాల వర్షం ముంచుకు రావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో దళారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టాలు పాలవుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి ప్రభుత్వం మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న దళారులు…
ప్రస్తుతం మొక్కజొన్న పంట చేతికి రావడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ కాంటాలు ఏర్పాటు చేసుకొని ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారు. ట్రేడింగ్ లైసెన్సులు లేకుండానే కొనుగోలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి పంగనామం పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి రైతుల సమస్యలను ఆసరాగా చేసుకొని దళారులు రెచ్చిపోతున్నారు. మార్కెట్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు రెగ్యులర్ మార్కెట్ సెక్రెటరీ లేకపోవడం దళారులకు ఓవరంగా మారింది. ఏమి చేసినా అడిగేవారు లేకపోవడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా దండ కొనసాగుతోంది. తెలంగాణలో కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అయినా అధికారులు కళ్ళు మూసుకొని ఉండటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి అధికారులకు తెలిసి జరుగుతోందా..? తెలిసిన పట్టించుకోవడం లేదా అని పలువురు మండిపడుతున్నారు. ప్రయివేట్ లో కొనుగోలు చేసిన మార్కెట్ ఫీజు చెల్లించాలి కానీ ఇప్పటివరకు మార్కెట్ ఫీజు చెల్లించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దళారి వ్యవస్థను కట్టడి చేసి మార్కెట్ ఫీజు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.



