ప్రతి ఆదివారం ఉదయ సూర్యున్ని
ముఖానికి తగిలించుకొని
మా పెద్దరువాజకు మేలుకొలుపై తలుపు కొట్టేవాడు
తన చేతిలో పెట్టె రూపంలో ఉన్న బతుకును ఆడిస్తూ
వచ్చి కూర్చునే వాడు
మన నెత్తిమీది మబ్బు తునక
అతని చేతిలో మెరుస్తున్న కత్తై
శిరసును ముద్దాడేది
తనకు తెలిసిన సకల ప్రపంచం
మెదడు స్క్రీన్ మీద రీలు రీలుగా పరుస్తూ
తన పొలాన్ని తాను దున్నేసేవాడు
సంవత్సరం బావతే
నాటి ఆనవాయితీ
ప్రతి ఇంటిలోను సౌందర్యాన్ని
చాకచక్యాన్ని దాచుకున్న కత్తి
పెట్టెలో ఎన్ని కలలు కనేదో
అతి నిరంకుశులైన
భూస్వాముల పైన పెత్తందారుల పైన
అతని విధి ముందు తలవంచుకొని కూర్చో వలసిందే
శ్రమశక్తి ప్రపంచాన్ని
నడిపిస్తుందనడానికి
ఇంతకంటే ప్రతీక ఎక్కడుంటుంది?
ఇప్పుడు అతను అతనిగా బ్రతకడం లేదు
నాటి కుల వివక్ష నశిస్తుంది సరే….
అతని నుంచి అతను కూడా దూరమవుతున్నాడు
చూద్దాం….
ఇది పురా జ్ఞాపకం కాకుండా ఈ కలం చికిత్సే కాపాడాలి
ప్రపంచ ప్రవాహం లో అతను తిరుగులేని
తీరం కావాలి.
డా. కాంచనపల్లి గోవర్ధన్ రాజు , 96 76 0966 14
అతడు పురా జ్ఞాపకం కాదు…
- Advertisement -
- Advertisement -


