Wednesday, April 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌ది గడీ బేడీల పాలన

కాంగ్రెస్‌ది గడీ బేడీల పాలన

- Advertisement -

– అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలి
– అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు
– పరిగి వెళ్తుండగా అప్పా జంక్షన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌
– కొద్దిసేపు హైడ్రామా, శంషాబాద్‌ పీఎస్‌కు తరలింపు
నవతెలంగాణ-గండిపేట, శంషాబాద్‌
రేవంత్‌రెడ్డి పాలన అంటే గడీ, బేడీల పాలన అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌ రావు విమర్శించారు. పేదల భూములపై రాబందులా రేవంత్‌రెడ్డి వాలుతున్నాడని విమర్శించారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాల్సింది పోయి గుంజుకుంటా రా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలో ఇండిస్టీయల్‌ కారిడార్‌లో భాగంగా భూములు కోల్పోతున్న రాపోలు, కాడ్లాపూర్‌ రైతులను పరామర్శించడానికి బీఆర్‌ఎస్‌ నేతలు మంగళవారం ఉదయం కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే అక్కడ బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మాజీ మంత్రులు పి.సబితారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు పరిగి బయలుదేరగా.. రాజేంద్రనగర్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని అప్పా జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలియకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు పోలీసుల కాన్వారుని ఫాలో అయ్యారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలను శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పుచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా కోకాపేట, శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యమని గొప్పగా చెప్పుకునే సీఎం ఏడో గ్యారంటీ ఎక్కడీ అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రతిపక్ష నాయకులు పోరాటం చేస్తుంటే పోలీసులను పెట్టి దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారనీ, ఇప్పుడు రైతులను కలవకుండా నిర్బంధాలు పెడుతున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట భూములను లాక్కొని పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఏమిటనీ ప్రశ్నించారు. రైతులతో మాట్లాడటానికి, వారికి భరోసా కల్పించడానికి వెళ్తుంటే మార్గమధ్యలో అరెస్టు చేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి దౌర్జన్యాలను ఎదుర్కొంటామని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రెండు, మూడు పంటలు పండే భూముల్లో చేపట్టిన బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకునే వరకూ తమ పార్టీ రైతుల తరపున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

వికారాబాద్‌ జిల్లా సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ ఇలాక అని, అక్కడ పచ్చని వ్యవసాయ భూములను గుంజు కోవడం దారుణమని అన్నారు. అధికారంలోకి రాకముందు పోడు భూములకు, అసైన్‌ భూములకు పట్టాలిస్తామన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజా పాలన పేరుతో పేదల భూములను లాక్కోవడం సరికాదన్నారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు రాష్ట్రంలో సీఎం పాలన సాగుతోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల భూములను వారికి దక్కకుండా చేయడం బాధాకరమన్నారు. కోహెడ వ్యవసాయ మార్కెట్‌కు కేటాయించిన స్థలంలో కాదని మరో చోట మార్కెట్‌ యార్డు నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2016 నుంచి కోర్టులో కేసు ఉన్న స్థలాన్ని మార్కెట్‌యార్డుకు కేటాయించి, ప్రభుత్వ స్థలాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం సరికాదని తెలిపారు. కోహెడ మార్కెట్‌ యార్డు విషయంలో తాము చెప్పిన విషయాన్నే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ రోజు చెప్పారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల భూములు వారికే దక్కేలా పోరాడుతామని స్పష్టం చేశారు.

పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత
పరిగి మండలం కాడ్లాపూర్‌ గ్రామానికి ఎమ్మెల్యే హరీశ్‌ రావు రానుండటంతో సమావేశానికి అనుమతి ఇవ్వాలంటూ గ్రామ సర్పంచ్‌ పులిందర్‌, మాజీ ఉపసర్పంచ్‌ జంగయ్య అనుమతి తీసుకునేందుకు సోమవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పరిగి ఎస్‌ఐ దాన్ని డీఎస్పీకి పంపగా డీఎస్పీ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. సమావేశానికి అనుమతి ఇవ్వాలని సర్పంచ్‌ పులిందరు, తన భార్య పిల్లలతో కలిసి పోలీస్‌స్టేషన్‌ ఎదుటే బైటాయించారు. అనుమతి ఇస్తే తప్ప ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున పీఎస్‌కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎస్‌ గేట్లు తెరవకపోవడంతో మహిళలు గేట్లపైకి ఎక్కారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మా జీవనోపాధి అయిన భూములు పోతున్నాయని, మా బాధను అర్థం చేసుకోవాలని’ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఓ మహిళా రైతు తాము చేస్తున్న నిరసనకు మద్దతు ఇవ్వాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. పారిశ్రామికవాడ విషయంలో గతంలో జరిగిన ఘటన నేపథ్యంలో అనుమతి ఇవ్వాల్సింది తన పరిధిలో లేదంటూ పరిగి ఎస్‌ఐ మోహన్‌ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా కాంగ్రెస్‌ కార్యకర్తగా పనిచేస్తే.. ఇప్పుడు ప్రభుత్వం తన భూములే తీసుకుని గొప్ప కానుక ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వికారాబాద్‌ జిల్లాలోనూ కొనసాగిన అరెస్టులు
పరిగిలో రైతుల ధర్నా నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కొనసాగాయి. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డితోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా మన్నెగూడ పీఎస్‌కు తరలించారు. అనంతరం ధరూర్‌, కోట్‌పల్లి, బంట్వారం పీఎస్‌లకు తరలించారు. ఆయా మండలాల్లో పార్టీ నేతలను ముందస్తు అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -