Monday, August 24, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఇంటి సంక్షోభం నుండి పుట్టిన ఈజీహెల్పర్స్‌

ఇంటి సంక్షోభం నుండి పుట్టిన ఈజీహెల్పర్స్‌

- Advertisement -

మనం ఎదుర్కొన్న ఇబ్బందులే మనల్ని శక్తిమంతంగా తయారు చేస్తాయి. కొత్త ఆలోచనలు అన్వేషించేలా చేస్తాయి. జీవితంలో ఎదిగేందుకు కొత్త మార్గాలను చూపుతాయి. ప్రియాంక రస్తోగి కూడా అలాగే ఓ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఒకప్పుడు తన అత్తమ్మకు నమ్మకమైన సహాయకురాలి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎవరు వచ్చినా ఒకటీ రెండు రోజులు వుండి వెళ్లిపోయేవారు. ఇలా ఆమె పడిన ఇబ్బంది ఐదేండ్ల తర్వాత ఈజీహెల్పర్స్ స్థాపనకు దారితీసింది. ఇప్పుడు ఈ సంస్థ 2,000 మందికి పైగా గృహ సహాయకులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లో నియమించింది.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పెరిగిన ప్రియాంకకు ఎప్పటినుంచో విమానాలు నడపాలని కల. పైలట్‌గా శిక్షణకు అవసరమైన పరీక్షలలో ఉత్తీర్ణత కూడా సాధించారు. కానీ ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ ప్రమాదంలో ఆమెకు 250 కుట్లు పడ్డాయి, కుడి కాలులో ఒక రాడ్ కూడా అమర్చారు. దాంతో బీఎస్సీ తర్వాత ట్రావెల్ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. చివరికి ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో, ఆ తర్వాత ఐహెచ్‌ఆర్‌లో చేరారు. అక్కడే ఆమె తన భర్త అంకిత్‌ను కలిశారు. ఉద్యోగరీత్యా ఆమె నిరంతరం ప్రయాణాలు చేయాల్సి వచ్చేది.

​పరిష్కారం వెదుకుతూ…
2014లో ప్రియాంక అత్తకు పక్షవాతం వచ్చింది. శరీరం చచ్చుబడిపోయింది. అదే ఏడాది ఆ దంపతులు గురుగ్రామ్ నుండి బెంగళూరుకు వచ్చారు. ప్రియాంక తన అత్తను చూసుకోవడానికి నమ్మకమైన ఓ సహాయకురాలి కోసం ఎంతో అన్వేషించారు. ‘నేను ఆమె కోసం మంచి హెల్పర్‌ ‌కోసం చాలా మంది ఏజెంట్లను సంప్రదించాను. అందరూ ఒకటి రెండు రోజులు వచ్చి మానేసేవారు. ఆమెను చూసుకోవడం, ఉద్యోగం, నమ్మకంగా ఉండని హెల్పర్స్‌.. ఈ మూడింటినీ సమన్వయం చేసుకోవడం చాలా ఒత్తిడిగా అనిపించేది’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. దీనికి ఓ పరిష్కారం వెతుకుతున్నప్పుడు గృహ సహాయకులుగా శిక్షణ పొందేందుకు వీలు కల్పించే ఒక ప్రభుత్వ ధృవీకరణ గురించి ప్రియాంకకు తెలిసింది. అంతే ఆమె కర్ణాటకలో గృహ సహాయక పనుల కోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) సర్టిఫైడ్ మాస్టర్ ట్రైనర్ అయ్యింది. సంరక్షకులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఇప్పించడంలో కూడా సహకరించేవారు.

​ఈజీహెల్పర్స్‌
బెంగళూరులోని స్టే జిల్లాలో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన స్నేహితుడు అరుణ్ మహేంద్రన్‌తో కలిసి ప్రియాంక సహాయకులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లో నియమించడం ప్రారంభించారు. ఇలా తన సొంత ఇంట్లోని ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రియాంక చేసిన ప్రయత్నం క్రమంగా వ్యాపారంగా రూపుదిద్దుకుంది. ఆమె అరుణ్‌తో కలిసి 2020లో ‘ఈజీహెల్పర్స్’ను ప్రారంభించారు. శిక్షణ పొందిన, నమ్మకమైన సహాయకులను, సంరక్షకులను అవసరమైన వారికి అందించడమే దీని లక్ష్యం. ‘మేమిద్దరు సహాయకులకు శిక్షణ ఇవ్వడంతో ప్రారంభించాం. గంటకు రూ.100 చొప్పున వసూలు చేస్తూ, అందులోంచి మేము ఒక చిన్న కమీషన్ ఉంచుకున్నాం. త్వరలోనే మేమే సొంతంగా సహాయకులను నియమించుకోవాలని నిర్ణయించుకున్నాం, అది మాకు బాగా కలిసి వచ్చింది’ అని ఆమె చెప్పారు.

​మహిళలే ఎక్కువ
ప్రియాంక స్వయంగా సెల్వి ఇంటికి వెళ్లి, వారి మొదటి ఉద్యోగిని నియమించుకున్నారు. రోజుకు ఎనిమిది గంటల పనికి నెలకు రూ.20,000. అదనపు గంటలకు ఓవర్‌టైమ్‌ ఉంటుంది. కరోనా సమయంలో బయటి నుండి హెల్పర్స్‌‌ని ఆపేశారు. దాంతో ప్రియాంక ఇంట్లోనే ఉండి సహాయం అందించేవారిని నియమించడం మొదలుపెట్టారు. ఈరోజు ఈజీహెల్పర్స్ ప్లాట్‌ఫామ్‌లో 11,000 మంది గృహ సహాయకులు నమోదు చేసుకున్నారు. వీరిలో 2,000 మందికి పైగా (వారిలో 90% పైగా మహిళలే) బెంగళూరులో శిక్షణ పొంది ఉద్యోగాలు పొందారు.

వివిధ రకాల సేవలను అందిస్తూ…
ఈ సంస్థ సేవలు ఇప్పుడు అనేక వర్గాలకు విస్తరించాయి. గృహ నిర్వహణ, వంట, శిశు సంరక్షణ, రోగుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, ప్రత్యేక అవసరాలు ఉన్నవారి సంరక్షణతో కూడిన సేవలు, డ్రైవింగ్‌, వడ్రంగి, తోటపని, డ్రై-క్లీనింగ్ ఇలా వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా పని చేసే హెల్పర్లకు ఆధార్ కార్డు ధృవీకరణ, స్వయంగా ఇంటికి వెళ్లి పరిశీలించడం, చివరగా అదనపు ఖర్చుతో ఒక థర్డ్-పార్టీ వెండర్ ద్వారా నిర్వహించబడే ఇ-కేవైసి, పోలీస్ ధృవీకరణ వంటివి ఉంటాయి. నైపుణ్య శిక్షణ ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం. ఈజీహెల్పర్స్ ‘నెస్ట్’ అనే పేరుతో ఒక హాస్టల్‌ కూడా నడుపుతోంది. ఇందులో హెల్పర్స్‌కు అవసరమైన శిక్షణ ఇస్తారు.

భిన్నమైన సవాళ్లు
ఈజీహెల్పర్స్ ప్రస్తుతం సొంత నిధులతోనే నడుస్తోంది. భవిష్యత్తులో నిధులు సమీకరించాలని చూస్తోంది. ఇది ఇటీవలే కోటి రూపాయల ఆదాయాన్ని దాటి లాభదాయకంగానే నడుస్తోంది. ఈజీహెల్పర్స్‌ను నడపడంలో సవాళ్లు మిగిలిన వ్యాపారాలతో పోల్చినపుడు భిన్నంగా ఉంటాయి. ‘మా వ్యాపారం ప్రజల చుట్టూ తిరుగుతుంది. నా రోజులో ఎక్కువ భాగం వారి అంచనాలు, భావోద్వేగాలు వినడంలోనే గడిచిపోతుంది. కొన్నిసార్లు నేను కేవలం వ్యవస్థాపకు రాలినో లేదా వ్యాపార నిర్ణయాలు తీసుకునే వ్యక్తినో మాత్రమే కాదు. అకస్మాత్తుగా వారి సమస్యలను వినేదాన్ని, మధ్యవర్తిని, సలహాదారుని, సమస్యలను పరిష్కరించేదాన్ని కూడా అవుతాను’ అని ఆమె అంటున్నారు.

​సమన్వయం నేర్చుకున్నాను
ఆమె బాధ్యతలు కేవలం కార్యాలయానికే పరిమితం కావు. ‘తనతో తగినంత సమయం గడపడం లేదని నా కూతురు భావించవచ్చు, డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి అత్తమ్మకు నా సహాయం అవసరం కావచ్చు, లేదా భర్త బయటికి వెళ్లినపుడు ఇంటి పనుల భారం నాపైనే పడవచ్చు. అందుకే, నిరంతరం అపరాధభావంతో బాధపడకుండా, ఈ రకరకాల అంచనాలను ఎలా నిర్వహించాలో నేర్చుకోవడమే నా అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని నేను భావిస్తున్నాను. ఈజీహెల్పర్స్‌‌ నాకు నేర్పినది.. వ్యాపారమే అయినప్పటికీ, నా వరకు అది అంతే సమానంగా ప్రజలను, సంబంధాలను, భావోద్వేగాలను, కుటుంబాన్ని, సమాజాన్ని నిర్వహించడం. అదే సమయంలో మరుసటి రోజు ఉదయం మేల్కొని ముందుకు సాగడానికి అవసరమైన శక్తిని కూడగట్టుకోవడం కూడా’ అని ఆమె అంటారు. ఈజీహెల్పర్స్‌ వచ్చే నెలలో యాప్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఇది తన సంరక్షణా విభాగాన్ని విస్తరించాలని, సాంకేతికతలో మరింత పెట్టుబడి పెట్టాలని, ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవాలని, పెరుగుతున్న సహాయకుల బృందానికి వసతి కల్పించడానికి అదనపు హాస్టల్ సౌకర్యాలను ప్రారంభించాలని చూస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -