కొండా సురేఖకు త్వరలోనే ఉద్వాసన..
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయా? ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు రాగానే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత… సీఎంపైన, కాంగ్రెస్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు… ఆమెపై గుర్రుగా ఉన్న సంగతి విదితమే. పార్టీ అధిష్టానం కూడా దీనిపై సీరియస్‌గా ఉంది. గతంలో అనేకసార్లు కొండా సురేఖకు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోని హైకమాండ్… ఈసారి ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలపై మాత్రం గరంగరంగా ఉంది. తన కూతురు చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించక పోగా… క్రమ శిక్షణా కమిటీకి కూడా స్పష్టమైన సమా ధానాన్ని సురేఖ ఇవ్వలేదు. అందువల్ల ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ అధిష్టానం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్టు సమాచారం. ఆయన హైదరాబాద్‌కు రాగానే ఇందుకు సంబంధించిన కసరత్తు ముమ్మరం కానుంది. ఈ క్రమంలో కొండా దంపతుల సామాజికవర్గాలైన మున్నూరు కాపు (మురళి), సురేఖ (పద్మశాలి)లకు క్యాబినెట్‌లో చోటు కల్పించాలని అధిష్టానం సూచించింది. తద్వారా ఆ రెండు సామాజిక వర్గాలను సంతృప్తి పరచవచ్చంటూ దిశా నిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ (ప్రభుత్వ విప్), పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఈరావత్రి అనిల్ (కార్పొరేషన్ చైర్మెన్)కు మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలిసింది. వీరితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని కూడా క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారని సమాచారం. కాగా ఈరావత్రి అనిల్‌కు ఎమ్మెల్సీ పదవినిచ్చి మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
మంత్రివర్గంలోకి ఆది శ్రీనివాస్, ఈరావత్రి అనిల్ ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



