Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌, బీజేపీల నాటకం తేటతెల్లం

కాంగ్రెస్‌, బీజేపీల నాటకం తేటతెల్లం

- Advertisement -

సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై సీడబ్ల్యూసీ నివేదికతో బట్టబయలు
కన్నేపల్లి పంపులను ఆన్‌ చేయాలి : మాజీమంత్రి జగదీశ్‌‌రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆడిన నాటకం తేటతెల్లం అయ్యిందని మాజీ మంత్రి జి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై సెంట్రల్ వాటర్‌ ‌కమిషన్‌ (‌సీడబ్ల్యూసీ) ఇచ్చిన నివేదికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం బట్టబయలైందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు నుంచి వరద జలాలను మాత్రమే తీసుకుని పోవాలని అన్నారు. దుర్మార్గంగా 140 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకుని పోయిందని చెప్పారు. పంటలు వేస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందనీ, కరెంటు కొనాలనే ఈ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. పంట కొంటే బోనస్ ఇవ్వాలని చెప్పారు. ఎల్‌నినో పేరుతో ‌రైతులకు నీళ్లు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. రైతులకు ఎల్‌నినో పెట్టిన శాపం కాదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపమని చెప్పారు. కన్నేపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌, రంగనాయక సాగర్ నిండేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని క్షమాపణలు చెప్పి కన్నేపల్లి పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. నాగార్జున సాగర్‌లో నీళ్లు ఉన్నాయో లేవో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందులో దూకితే తెలుస్తుందన్నారు. నిషేధిత జాబితాలో కొందరి ఎమ్మెల్యేల భూములున్నాయని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను సీఎం, ఇద్దరు మంత్రులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. లండన్‌‌లో రేవంత్‌‌రెడ్డిని కేటీఆర్‌, హరీశ్‌‌రావు కలిస్తే ఫొటోలు బయటపెట్టాలని బీజేపీ నేత మహేశ్వర్‌‌రెడ్డిని డిమాండ్‌ ‌చేశారు. సీబీఐ, రా కేంద్రం చేతిలోనే ఉన్నాయనీ, వాస్తవాలు వెల్లడించాలని కోరారు. బీఆర్ఎస్ గెలవబోతుందనే కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. ప్రభుత్వ ద్రోహంపై కేసీఆర్, కేటీఆర్‌‌తో చర్చించి కార్యాచరణను రూపొందిస్తామన్నారు. భూభారతితో వచ్చిన సంక్షోభమే ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంచాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్ భాస్కర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, పైలా శేఖర్ రెడ్డి, నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -