నవతెలంగాణ – సుల్తాన్ బజార్
విద్యార్థులు చదువుతోపాటు సమాజానికి సేవ చేయడంలో ముందుండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ గంట చక్రపాణి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ కార్యాలయంలో ఇగ్నో విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యారంగంలో ఉన్నత విద్య అందని వారికి విద్యను అందిస్తూ వారి ఆశయాలను సహకారం చేయడంలో దూరవిద్య విశ్వవిద్యాలయాలు విప్లవాత్మక పాత్రను పోషిస్తున్నాయని కొనియాడారు.
జాతీయ విద్యా విధానం కీలక సంస్కరణలను ప్రకటించడానికి ముందే ఇగ్నో అనేక సంస్కరణలు, నైపుణ్య ఆధారిత విద్యను ఆచరిస్తుందని గుర్తు చేశారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి చెందిన 2815 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇగ్నో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రాజు, అనిల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



