– బుధవారం మెరుపు దాడులు
– ఉలిక్కిపడ్డ కార్యాలయ ఉద్యోగులు
– రికార్డులను జల్లెడ పడుతున్న బృందం
– పన్ను వసూళ్లు, ఇంటి అనుమతులపై ఆరా
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయం బుధవారం విజి”లెన్స్” అధికారుల రాకతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఒకసారిగా మెరుపు దాడులు నిర్వహించడంతో కార్యాలయ ఉద్యోగులు హైరానా పడ్డారు. మండల పరిషత్ కార్యాలయంలోని రికార్డులు జల్లెడ పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉండి పన్ను వసూళ్లు ఇంటి అనుమతులకు సంబంధించి రికార్డులను సైతం పరిశీలించనున్నారు.
రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖాగోయెల్ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.ఉదయం కార్యాలయానికి చేరుకున్న బృందం తనిఖీలు చేపట్టింది. కంప్యూటర్లలోని డేటా, కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. పథకాల అమలు, నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా సిబ్బంది హాజరు పట్టికను విశ్లేషిస్తున్నారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ ముగిసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తాం అని విజిలెన్స్ బృందం స్పష్టం చేసింది.
ప్రణాళికలో అధికారులు.. విజిలెన్స్ దాడులు
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య హెల్త్ వీక్ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలిమినేడు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఓవైపు కలెక్టర్ కార్యక్రమం మరోవైపు విజిలెన్స్ సోదాలతో పంచాయతీ కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామాల్లో హెల్త్ ప్రోగ్రామ్‌లో ఉండాలా ? లేక విజిలెన్స్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ ఆఫీస్‌కు వెళ్లాలా? అని తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఎంపీడీఓ శిక్షణ పేరుతో నగరానికి పరిమితం కాగా, అటు మండల పంచాయతీ అధికారి గ్రామాల్లో పర్యటనలో ఉన్నారు. మండల కార్యాలయంలో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఉండటం, కీలక సమయంలో విజిలెన్స్ దాడులు జరగడం ఇప్పుడు మండల వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ దాడులతో పక్కనే ఉన్న ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వణుకు మొదలైంది.



