Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆస్పత్రి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఆస్పత్రి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతున్న ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ౩౦ పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆస్పత్రిగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. అన్ని వసతులతో నూతన భవన నిర్మాణం కోసం రూ. 33.15 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ధర్పల్లి ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, ఇంకనూ చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

పనులు మందకొడిగా కొనసాగుతుండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు రోజువారీగా పనుల్లో పాల్గొంటున్నారని ఆరా తీశారు. పనులను వేగంగా జరిపించాలని, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని గడువు విధించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయితే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున యుద్ధప్రతపదికన పనులు జరిగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అన్నారు. భవన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆస్పత్రికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిర్మాణ పనులలో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజారోగ్యంతో కూడుకుని ఉన్నందున ఏరియా ఆస్పత్రి నిర్మాణం పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక కొరత వంటి సాకులు చెప్పవద్దని, టీజీఎండీసీ ద్వారా అనుమతులు తీసుకుని నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు.

ఉదయం వేళలోనే ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాలలో ఇసుక వాహనాలు తిరుగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుండి ఏరియా ఆస్పత్రి వరకు అప్రోచ్ రోడ్డును సైతం నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఏ.ఈ ప్రవీణ్, ఆర్ఐ రాజేశ్వర్, జిపిఓ సునీల్ గౌడ్  తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -