Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూసార పరీక్ష.. రైతుకు రక్ష.!

భూసార పరీక్ష.. రైతుకు రక్ష.!

- Advertisement -

‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’లో రైతులకు అవగాహన
మట్టి నమూనాల సేకరణ
వారం రోజుల్లో ఫలితాలు
నవతెలంగాణ – మల్హర్ రావు

వ్యవసాయ క్షేత్రాలు ఏ రకమైన పంటలకు ఆనుకూలంగా ఉంటాయి,నేలలో పోషకాల స్థాయి ఎలా ఉంది, ఎలాంటి ఎరువులు, ఏ సందర్భాల్లో ఉపయోగించాలనే విషయాలపై రైతులకు అవగాహన కలగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం అలాగే ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఏటా నష్టపోతున్నారు. ఈ క్రమంలో భూసార పరీక్షలు నిర్వహించి తదనుగుణంగా పంటలు సాగుచేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

మండలంలో తాడిచెర్ల, పెద్దతూండ్ల, రుద్రారం, కొయ్యుర్ నాలుగు క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 2300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఏటా వర్షాకాలం, యాసంగిలో వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఎరువులు ఎంత మోతాదులో వాడాలి, భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉందో తెలియక సరైన దిగు బడి రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

అవగాహన లేమితో వెనుకంజ..
రైతులు ఇష్టానుసారం రసాయన ఎరువుల వాడకంతో సాగు వ్యయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయాధికారులు, సిబ్బంది పదేపదే చెబుతున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని తెలుస్తోంది.

ఫలితాల ఆధారంగా..
భూసార పరీక్ష ఫలితాలు అనుసరించి సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా నేలలోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ లభ్యతను తెలుసుకోవచ్చు. తద్వారా అవసరమైన మోతాదులో ఎరువుల వినియోగానికి అవకాశం ఉంటుంది.

గ్రామానికి పది మట్టి నమూనాల సేకరణ..
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలో రెవెన్యూ గ్రామాల వారీగా కనీసం పది మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నమూనాలను భూసార పరీక్ష కేంద్రాలకు పంపించి మే 10 లోపు ఫలితాలను అందించాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేక రించే పనుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

సద్వినియోగం చేసుకోవాలి: శ్రీజ..మండల వ్యవసాయ అధికారి
రైతులు భూసార పరీక్షలు ఏటా చేయించుకోవాలి. తద్వా రా నేలకు కావాల్సిన పోషకాలను ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ఆయా క్లస్టర్లలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా నేరుగా వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి. ఈ పరీక్షలు పూర్తిగా ఉచితం. వారం రోజుల్లో రిపోర్టులు వస్తాయి.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -