నవతెలంగాణ-హైదరాబాద్: దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం విడాలని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వాల్మీకి కమ్యూనిటీ హాల్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ సభాధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభలను నివారించడంలో దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఇరాన్ పై సామ్రాజవాద అమెరికా-ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల పట్ల మౌనం వహిస్తూ బీజేపీ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నదన్నారు. వలసవాద సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకిస్తున్నామని ధైర్యంగా చెప్పలేని మోడీ ప్రభుత్వం, దేశ సార్వభౌమత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనమువుతుందని, అయినా కూడీ మోడీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆర్థిక అస్థిరత్వం పై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో పెరిగి పోతున్న నిరుద్యోగం, దారిద్రం, పేదరికం, ఆకలి వంటి సమస్యలను గాలికి వదిలేసి వివిధ వర్గాల మధ్య విద్వేష రాజకీయాలతో అశాంతిని సృష్టిన్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. శ్రీరాం నాయక్, వెంకట్రాములు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేరళకు వెళ్లి రేవంత్ రెడ్డి నాటకాలు ఆడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరన్నారు. వ్యవసాయ కూలీలకు,12,000 కౌలు రైతులకు 15000,మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని అమలు చేయని అసమర్ధ సీఎం, దేశానికి ఆదర్శంగా నిలిచిన కేరళ రాష్ట్రాన్ని విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. హామీల అమలు చేయడం చేతకాక అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజా పోరాటాల ద్వారా బుద్ధి చెబుతామన్నారు.కేరళ తరహాలో మొత్తం ప్రజానీకానికి ఉచిత విద్య అందించే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి ఉందా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో CPM జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు జి రాజు, పరం జ్యోతి,వివి నరసింహ,మద్దిలేటి,ఈదన్న,నర్మదా,రమేష్, మండలాల కార్యదర్శులు విజయ్ కుమార్, రాముడు, నరసింహులు, నరేష్,మంచాల నరసింహ, వెంకటేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



