నవతెలంగాణ – ఆర్మూర్
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులు, ఆత్మీయులతో తనకున్న విడదీయలేని అనుబంధాన్ని చాటుకుంటూ ఆయన గ్రామగ్రామాన పలకరింపులు సాగించారు.
పట్టణంతో పాటు, ఆలూర్ మండల కేంద్రం, ఖుద్వాన్ పూర్, కల్లెడ, రాంపూర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల మరణించిన పలువురు ఆత్మీయుల కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మరణించిన వారి చిత్రపటాలకు నివాళులర్పించి, ఆయా కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు నా కుటుంబ సభ్యులతో సమానమని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తన ప్రాథమిక బాధ్యతని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి గారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.



