Tuesday, August 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజల హక్కు కాలరాయడం

ప్రజల హక్కు కాలరాయడం

- Advertisement -

బహుశా స్వాతంత్ర్యానంతర కాలంలో పేదల జీవితాలపై ఎక్కువ తక్షణ ప్రభావాన్ని చూపిన చట్టం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. 2005 ఆగస్టు 23న పార్లమెంటు దీనిని ఆమోదిస్తే 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. యుపిఎ-1 ప్రభుత్వం వామపక్షాల మద్దతు మీద ఆధారపడవలసిన పరిస్థితి అప్పుడు ఉన్నందున, వామపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఆ చట్టాన్ని చేసింది. అంతకు మునుపు పనికి ఆహారం వంటి పథకాలు ఉండేవి. వాటన్నింటికన్నా ఈ ఉపాధి హామీ చట్టం ఒక విషయంలో భిన్నమైనది. గ్రామీణ భారతదేశంలో ఎక్కడైనా సరే పని కల్పించాలని కోరితే వారందరికీ పని కల్పించే చట్టపరమైన బాధ్యత ప్రభుత్వానిదేనని ఈ చట్టం నిర్దేశించింది. ఒకవేళ అలా పని కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే ఉపాధి కల్పించమని కోరిన దరఖాస్తుదారునికి నష్టపరిహారం చెల్లించవలసి వుంటుందన్న నిబంధన కూడా ఆ చట్టంలో ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ చట్టం పని హక్కును కల్పించింది.
కుటుంబంలోని ఒక్క సభ్యునికి మాత్రమే పని కల్పించమని కోరే అవకాశం ఈ చట్టంలో ఉండడం వాస్తవమే. అది కూడా ఏడాదికి వంద రోజుల వరకు మాత్రమే పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఈ చట్టం కల్పించడం కూడా వాస్తవమే. ఈ విధమైన పరిమితులు ఉన్నప్పటికీ, అటువంటి పరిమిత పని హక్కునైనా కల్పించడం ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. భారత రాజ్యాంగం తన పౌరులకు కల్పించిన పౌర హక్కులు, రాజకీయ హక్కులకు దీటుగా ఆర్థిక హక్కులను కల్పించలేదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ఈ లోపాన్ని కొంతవరకు పాక్షికంగా పూడ్చింది. ఈ చట్టం వలన గ్రామీణ ఆదాయాలు పెరిగాయి. పని కల్పించడం అనేది ప్రభుత్వ ఇష్టాన్ని బట్టి కాకుండా ప్రజలకు పని ఒక హక్కుగా కల్పించబడడం వలన పౌరసత్వానికి హుందాతనం సంక్రమించింది.

సహజంగానే, ఈ చట్టం పెత్తందారీ పాలక వర్గాలకి కంటగింపు అయింది. భూస్వామ్య వ్యవస్థకి తాము పరిరక్షకులం అని భావించుకుంటూ చెలామణీ అవుతున్న ఆ తరగతుల వారు గ్రామీణ పేదల ఆదాయాలు పెరగడాన్ని జీర్ణించుకోలేక పోయారు. పైగా ఆ పేదల్లో అత్యధికులు దళితులు కావడం, అంతకు ముందు మాదిరిగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగెత్తుకు వచ్చి చాకిరీ చేయడానికి వాలే పరిస్థితి ఈ చట్టం తర్వాత మారిపోవడం పెత్తందారులు అసహనానికి కారణమైంది. గ్రామీణ నిరుద్యోగ రిజర్వు సైన్యం సైజు తగ్గి వేతనాలను పెంచుకోడానికి చేసే పోరాటాలకు బలం పెరగడంతో వారి కోపానికి హద్దు లేకుండా పోయింది. దాంతో తమ తరఫున చిలకపలుకులు పలికేందుకు సిద్ధంగా ఉన్న ‘‘పెంపుడు కుక్క మాదిరి ఆర్థికవేత్తలను’’ రంగంలోకి దింపారు. వాళ్ళు ఉపాధి హామీ చట్టానికి ప్రభుత్వం చేసే వ్యయం అంతా మురికి కాలువలో పారబోసినట్టేనంటూ పాట అందుకున్నారు.
2014లో పచ్చి మితవాద ప్రభుత్వం ఏర్పడి నరేంద్ర మోడీ ప్రధాని అవడంతో ఈ పథకాన్ని రద్దు చేయించడానికి ఈ పెత్తందారీ వర్గాలకు అవకాశం వచ్చింది. అయితే, మత విద్వేష రాజకీయాల మంటలను రాజేయడం ఆ ప్రభుత్వానికి అన్నింటికన్నా ప్రథమ ప్రాధాన్యతగా ఉండడంతో ఈ ఉపాధి హామీ చట్టం వైపు దృష్టి పెట్టడానికి మోడీ ప్రభుత్వానికి వెంటనే వీలు చిక్కలేదు. కాని మొత్తానికి ఆ పని చేసేసింది. 2026 నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం స్థానే ఒక కొత్త పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. ఈ కొత్త పథకం పనిని ఒక హక్కుగా పరిగణించకపోవడం దాని ముఖ్య లక్షణం. పాత పథకం వంద రోజుల పనిని గ్యారంటీగా కల్పించితే, కొత్త పథకం -విబి గ్రామ్‌‌జి- 125 రోజుల వరకూ పని కల్పిస్తుందని చెప్పుకుంటూ ఆ ప్రచారం ముసుగులో పనిని హక్కుగా పరిగణించడం లేదన్న వాస్తవాన్ని మరుగు పరుస్తున్నారు నిజానికి పని కల్పించాలని కోరినవారందరికీ హక్కుగా పని కల్పించే విధానం ఏదీ ఈ కొత్త పథకంలో లేదు.
పాత పథకంలో ఎక్కడైనా, ఎవరైనా పని కల్పించాలని కోరితే వారందరికీ వంద రోజుల వరకూ పని కల్పించి తీరాలన్న నియమం బదులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ పనులు కల్పించాలని ఎంపిక చేస్తే అక్కడ మ్రాతమే పనిని 125 రోజుల వరకూ కల్పిస్తారు. అంటే, ఎక్కడ ఎక్కువగా పనులను కల్పించడం అవసరంగా ఉందో అక్కడ పనులు కల్పించడం కాకుండా, ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులలో ఎక్కడెక్కడ కూలీలు అవసరం అవుతారో అక్కడ మాత్రమే పనులను కల్పించనున్నారు.

ఇలా ఏకపక్షంగా పని హక్కును ప్రజల నుంచి హరించడమే కాదు, ఈ కొత్త పథకానికి అవసరమైన నిధులను వెచ్చించే విధానాన్ని కూడా కేంద్రం ఏకపక్షంగా మార్చివేసింది. పాత పథకంలో కూలీలకు చెల్లించే వేతనాలను మొత్తం కేంద్రమే భరించేది. పనులలో వినియోగించే మెటీరియల్‌ ‌ఖర్చుల బిల్లులో 25 శాతాన్ని మాత్రం రాష్ట్రాలు భరించేవి. అంటే మొత్తం ఖర్చులో కేంద్రం తొంభై శాతాన్ని, రాష్ట్రాలు పది శాతాన్ని భరించేవి. ఇప్పుడు విబి గ్రామ్‌‌జి పథకంలో కేంద్రం అరవై శాతం ఖర్చును మాత్రమే భరిస్తుంది. తక్కిన నలభై శాతాన్నీ రాష్ట్రాలు భరించాలి. ఇలా రాష్ట్రాలమీద అదనపు భారాన్ని మోపేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కనీసం మాట మాత్రంగానైనా సంప్రదించలేదు. మన దేశంలో కేంద్రంతో పోల్చితే రాష్ట్రాల ఆర్థిక స్తోమత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రతీ ఐదేండ్లకూ ఆర్థిక సంఘం ఆర్థిక వనరులను కేంద్రం-రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంచుకోవాలన్నది సిఫార్సు చేస్తుంది. అటువంటప్పుడు గ్రామీణ ఉపాధి ఖర్చులో రాష్ట్రాల వాటాను అమాంతం పెంచివేయడం అంటే పరోక్షంగా ఈ పథకం విస్తృతిని కుదించివేయడమే అవుతుంది. అంతేగాక, అలా కుదించుకు పోడానికి బాధ్యత అంతా రాష్ట్రాలమీదే నెట్టివేయవచ్చు.
ఇప్పుడు కొత్త పథకంలో కేంద్రం ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడే పనులు కల్పిస్తుంది. అంటే కేంద్రం చేపట్టే ప్రాజెక్టులలోనే ఉపాధి పనులు కల్పించడం జరుగుతుంది. దానికయ్యే ఖర్చులో రాష్ట్రాలు నలభై శాతం భరించాలి. అంటే కేంద్రం చేపట్టే పనులకు అయ్యే ఖర్చు భారం కూడా రాష్ట్రాల మీదే మోపడం అన్నమాట. ఆ విధంగా కేంద్రం విబి గ్రామ్‌‌జి పథకంతో ఒకే దెబ్బకు ప్రజల పని హక్కునూ హరించివేసింది. ఉపాధి కల్పనకు పెట్టవలసిన ఖర్చునూ కుదించివేసింది. తన స్వంత ప్రాజెక్టుల ఖర్చులో కొంత భాగాన్ని రాష్ట్రాల మీద నెట్టివేసింది. తానేమీ ఉపాధి పథకాన్ని కుదించడం లేదంటూ కేంద్రం బుకాయిస్తున్నా వాస్తవం ఏమిటో అందరికీ కనిపిస్తూనే వుంది. ఒక హక్కుగా పనిని కల్పించడం అన్నది తొలగించడం అంటేనే ఈ పథకం పరిధిని కుదించడం అని అర్ధం అవుతోంది. ఇప్పుడు విబి గ్రామ్‌‌జి కింద మొదటి నెల-అంటే జులై 2026లో ఎన్ని పని దినాలు కల్పించారో లెక్కలు వచ్చాయి. వాటిని ఏడాది క్రితం ఇదే జులై నెలలో కల్పించిన పని దినాలతో పోల్చితే కొత్త పథకం బండారం బైట పడింది. 2025 జులైలో 15 కోట్ల 33 లక్షల పని దినాలను కల్పిస్తే, 2026 జులైలో 7 కోట్ల 67 లక్షల పనిదినాలను మాత్రమే కల్పించారు. కల్పించిన పని దినాలు దాదాపు 50 శాతం తగ్గిపోయాయి. అంతేకాదు, పనులను పొందగలిగిన కుటుంబాల సంఖ్య 51.45 శాతం తగ్గి 68 లక్షల 94 వేల కుటుంబాలకు మాత్రమే పని లభించింది.
గత జులై మాసంతో ఈ ఏడాది జులై మాసపు పరిస్థితిని పోల్చి చూడడం వలన ఇంత భారీ కుదింపును సమర్ధించు కోడానికి ప్రభుత్వం ఏ సాకులు చెప్పినా అది చెల్లదు. చాలా జిల్లాల్లో ఈ పథకాన్ని క్రమంగా ఎత్తి పెట్టేస్తున్నారు. ఈ ఏడాది పనులు కావాలన్నవారి సంఖ్య తగ్గిపోయిందని చెప్తే అది చెల్లదు. ఈ కొత్త పథకం పని హక్కును హరించడంతోబాటు, పనుల కల్పనను కూడా బాగా కుదించివేస్తోంది. ఒకవైపు నిరుద్యోగం బాగా తీవ్రంగా పెరిగిపోయింది. విద్యావంతులైన నిరుద్యోగులు జంతర్‌‌మంతర్‌ ‌వద్ద తమ ఆగ్రహాన్ని ఏవిధంగా వ్యక్తం చేశారో మనం చూశాం. నైపుణ్యం లేని గ్రామీణ కార్మికులలో కూడా నిరుద్యోగం బాగా పెరుగుతోంది. ఉపాధి కల్పన మీద అసాధారణ రీతిలో ఈ దాడి జరుగుతోంది.

ఆర్థిక, సామాజిక సంక్షోభం ఇంత తీవ్రంగా ముదిరిపోతున్నా, దానిని నివారించడానికి ప్రభుత్వం ఉపాధి కల్పనకు పూనుకునే బదులు తన ఆశ్రిత పెట్టుబడిదారులకు భారీగా వనరులను బదలాయించడమే పరిష్కారం అనే దిక్కుమాలిన తర్కాన్ని నయా ఉదారవాదం ముందుకు తెస్తోంది. ఉద్యోగాలు కల్పించాలంటే ఫ్యాక్టరీలు వగైరాలను పెట్టేందుకు పెట్టుబడిదారులకు గతం కన్నా ఎక్కువగా ప్రోత్సాహకాలను ఇవ్వాలని, అందుకోసం రకరకాల దారుల్లో వారికి సంపదను బదలాయించాలని అంటోంది. ప్రభుత్వం తన వనరులను ఆ విధంగా పెట్టుబడిదారులకు బదలాయించడంతో దానివద్ద ఉండే పరిమిత వనరులు సైతం హరించుకు పోతున్నాయి. ప్రభుత్వమే నేరుగా విద్యా, వైద్య రంగాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి నిధులు లేవంటూ దాటవేస్తోంది. ఇది నిరుద్యోగాన్ని మరింత పెంచుతోంది.
ఒక్క విద్యా రంగంలోనే దాదాపు 11 లక్షల ఉపాధ్యాయ పోస్టులు నింపకుండా ఉన్నారు. వీటిని గనుక నింపితే (అందుకోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక తోడ్పాటు అందించాలి) 11 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పడడంతోబాటు, వాటికి అనుబంధంగా మరిన్ని ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి. అందుచేత ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడంతోబాటు, ఉపాధిని హక్కుగా కల్పించిన పథకాలను హరించడం గాక, వాటిని మరింత విస్తరిస్తే నిరుద్యోగ సమస్య నుంచి ఊరట లభిస్తుంది. అంటే పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీని విస్తరించాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పని కల్పిస్తాం అన్న నిబంధనను కూడా సడలించాలి.
ఇలా చేయడానికి నిధులెక్కడి నుంచి వస్తాయి అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. పెట్టుబడిదారులకు మరింతగా ఆర్థిక వనరులను, సంపదను బదలాయించే ప్రస్తుత అర్ధం లేని విధానాన్ని తిరగదోడాలి. వారికి నిధుల బదలాయింపును నిలిపి వేయాలి. పైగా వారి నుంచి సంపద పన్ను, వారసత్వ పన్ను వంటి రూపాల్లో ఆదాయాన్ని రాబట్టాలి. అయితే ఇటువంటి విధానాన్ని ఎన్డీయే వంటి పచ్చి తిరోగామి ప్రభుత్వం చేపడుతుందని అనుకోలేము. నిరుద్యోగ సమస్య నుండి నిజంగా బైట పడాలనుకునేవారంతా ఈ నయా ఉదారవాద భావాల ఆధిపత్యం నుండి వెంటనే బయటపడడం చాలా అవసరం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -