రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి..ఉష్ణోగ్రత 35 డిగ్రీలను దాటి 40 డిగ్రీల వైపు శరవేగంగా పరిగెడుతోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే.. మేలో ఎలా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా నీటి ఎద్దడి తీవ్రతరమవుతోంది. కొండ ప్రాంతాలు, ఆదివాసీ, గిరిజన గూడేల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారమే మహబూబ్‌నగర్,నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఇప్పటికే తాగునీటికి కటకట ఏర్పడింది. ఈ జిల్లాల్లోని 19 నియోజకవర్గాలు, 3,200 గ్రామాల్లో నీటి కొరత ఏర్పడే ప్రమాదముందని అంచనా. దీన్ని అధిగమించేందుకు అన్ని రకాల ప్రణాళికలు రచించామని ప్రభుత్వం చెబుతోంది. గత రెండేండ్ల నుంచి వీటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఉన్నతాధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేకపోవటం గమనార్హం.
గతేడాది కృష్ణా బేసిన్‌లో అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడలేదన్నది గణాంకాల సారాంశం. ఆ ప్రభావం ఈ వేసవిలో ఉండబోతున్నది వాతావరణ శాఖ వర్గాల భోగట్టా. ఈ క్రమంలో పలు రిజర్వాయర్లలో నీటి మట్టం అనుకున్నంత స్థాయిలో లేదు. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిలో పొదుపు తప్పదనే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి. అలాంటప్పుడు ఫ్లోరైడ్ ప్రభావిత ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని ప్రజలు మినరల్ వాటర్ మీద ఆధారపడా ల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికే 20 లీటర్ల క్యాన్‌కు రూ.10 నుంచి రూ. 20 వసూలు చేసున్న నీటి వ్యాపారులు.. రాబోయే రెండు నెల్లపాటు ‘డిమాండ్-సప్లయ్’ సూత్రాన్ని విధిగా పాటించాలని నిర్ణయించారు. అప్పుడు గుక్కెడు నీటి కోసం జనాలు పడరాని పాట్లు పడాల్సి రావటం ఖాయం.
జీడీపీలు, జీఎస్‌డీపీలు, వృద్ధి రేటు గురించి మన పాలకులు, ప్రభుత్వాధినేతలు గొంతు చించుకుని ఎంత గొప్పలు చెప్పుకున్నా.. చుక్క నీటికోసం దళితులు, ఆదివాసీలు మైళ్ల కొద్దీ నడవాల్సి రావటం వారి విధానాల్లోని డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఈ దృశ్యాలు మనకు ఎక్కువగా కనబడుతుంటాయి. బిందెలు నెత్తిన పెట్టుకుని మహిళలు మండుటెండలో నడుస్తున్న ఫొటోలు అనునిత్యం పత్రికల్లో ప్రత్యక్ష మవుతుంటాయి. ఎందుకంటే హైదరాబాద్‌లోలాగా ఆయా ప్రాంతాల్లో ఏ కంపెనీగానీ, ఏ వ్యక్తీగానీ ‘చలివేం ద్రాలు’ ఏర్పాటు చేయరు కాబట్టి. రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు అన్ని కాలాల్లో, ముఖ్యంగా పనులు దొరకని వేసవిలో ఇప్పటిదాకా ఇంత బువ్వ పెట్టింది ‘ఉపాధి హామీ’ చట్టం. కానీ దాని పేరును మార్చి..ఆ చట్టం ఉద్దేశాన్ని ఏమార్చి… అన్నింటికీ ‘రామ్.. రామ్…’ చెప్పేసింది మోడీ ప్రభుత్వం. నిధుల్లో కోత పెట్టి, పని దినాలను కట్ చేసి, వారి కడుపు మీద కొట్టింది. అలాంటప్పుడు తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వారు కేంద్రంతో కొట్లాడైనా సరే..ఇలాంటి పేదలందర్నీ విధిగా ఆదుకోవాలి.
అందరికీ పని కల్పించటంతోపాటు పని ప్రదేశాలు, గృహాలకు కూడా సురక్షితమైన తాగునీటిని అందించాలి. ఇక రాజధాని హైదరాబాద్‌తోపాటు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ‘వాటర్ మాఫియా’ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ దందా ద్వారా ఈ రెండు మూడు నెలల్లో ఏడాదికి సరిపడా సంపాదించు కుంటారనేది బహిరంగ రహస్యం. విల్లాలు, అపార్టుమెంట్లు, కాలనీలు, బస్తీల్లోని ప్రజల నీటి అవసరా లను ఆసరాగా చేసుకుని ఇబ్బడిముబ్బడిగా దండుకుంటారు వాటర్ ట్యాంకర్ల యాజమాన్యాలు. ఆ సమయాల్లో వాటర్ వర్క్స్, జలమండలి అధికారుల ఫోన్లు ‘ఎందుకోగాని’ మూగబోవటం పరిపాటి.
ఈ దుస్థితిని నుంచి ప్రజలను బయటపడేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలి. తెలంగాణ వ్యాప్తంగా రాజధాని నుంచి పంచాయతీ వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు మంచి నీటిని అందించటమనేది తమ కనీస బాధ్యతగా ప్రభుత్వాధినేతలు గుర్తించాలి. వాటర్ మాఫియా దోపిడీని అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను రంగంలోకి దించాలి. ఎక్కడెక్కడ నీటి ఎద్దడి ఉందో.. అక్కడక్కడ నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించి, అమలు చేయించాలి. జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లకు ఆ మేరకు తగినన్ని నిధులు కేటాయించాలి. లేదంటే ‘గుక్కెడు నీటి కోసం గోస…’ అనే పతాక శీర్షికలతో పత్రికల్లో వార్తలు రాకమానవు.
వేసవి ప్రణాళిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



