గిల్, బట్లర్, సుందర్ అర్ధసెంచరీలు
ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 211పరుగులు
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) అర్ధసెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీకి కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణయం బెడిసికొట్టింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సాయి సుదర్శన్ (12) ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఔటైనా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా బట్లర్ తనదైన శైలిలో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 3ఫోర్లు, 5భారీ సిక్సర్లతో 52పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 60 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న బట్లర్‌ను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెవిలియన్ పంపడంతో ఢిల్లీ శిబిరం ఊపిరి పీల్చుకుంది. బట్లర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఒకవైపు బాధ్యతాయుతంగా ఆడుతూనే, మరోవైపు చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. సుందర్ కూడా అద్భుతంగా రాణించడంతో గుజరాత్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 104 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో గిల్(70; 45బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) 70 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు సుందర్ కేవలం 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ బ్యాటర్ల ధాటికి ఢిల్లీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ అక్షర్ పటేల్ సహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముకేశ్ కుమార్ 4 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 42 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఒక్క లుంగి ఎంగిడి మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్లలో గ్లెన్ ఫిలిప్స్ (14లి) కూడా మెరుపులు మెరిపించడంతో గుజరాత్ స్కోరు 210 పరుగులకు చేరింది.
స్కోర్‌బోర్డు…
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (బి)ముఖేష్ కుమార్ 12, గిల్ (సి)నితీశ్ రాణా (బి)ఎన్గిడి 70, బట్లర్ (బి)కుల్దీప్ 52, సుందర్ (సి)నితీశ్ రాణా (బి)ముఖేష్ కుమార్ 55, ఫిలిప్స్ (నాటౌట్) 14, తెవాటియా (నాటౌట్) 1, అదనం 6. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 210పరుగులు.
వికెట్ల పతనం: 1/19, 2/79, 3/183, 4/205
బౌలింగ్: ముఖేష్ కుమార్ 4-0-55-2, ఎన్గిడి 4-0-24-1, అక్షర్ పటేల్ 3-0-32-0, కుల్దీప్ యాదవ్ 4-0-42-1, నటరాజన్ 4-0-34-0, విప్‌రాజ్ నిగమ్ 1-0-23-0.
రాణించిన గుజరాత్ బ్యాటర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



