– అసైన్డ్కు పట్టాల మాట గుర్తుందా.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు
– పేదల నుంచి అసైన్డ్ భూములు లాక్కోవడమే..
– అ భూములకు హక్కులు కల్పించే మాటే కరువు
– కాంగ్రెస్ మాటలు నీటిమూటలేనా..
– పట్టాల కోసం అసైన్డ్దారుల ఎదురు చూపులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ తమకు అధికారం ఇస్తే.. ప్రజలందరికీ అభయం కల్పిస్తామని ‘అభయ హస్తం’ మ్యానిఫెస్టోతో ముందుకు వచ్చింది. మ్యానిఫెస్టోలో ప్రధానమైనది అసైన్డ్దారులకు పట్టాలిచ్చి, హక్కులు కల్పించే హామీ. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతోంది కానీ నేటికీ ప్రభుత్వం అసైన్డ్దారులకు పట్టాలు ముచ్చట మాట్లాడటం లేదు. పైగా అభివృద్ధి పేరుతో అసైన్డ్భూములను రైతుల నుంచి వేల ఎకరాల్లో తీసుకుంటోంది. దాంతో అసైన్డ్దారులు ఆందోళన చెందుతున్నారు. పట్టాలు దేవుడెరుగు.. పంట భూములు లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాల కోసం ఎదురు చూస్తున్న అసైన్డ్దారులపై కథనం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నాటి భూ పోరాటాల ఫలితంగా నాటి పాలకులు లక్షలాది ఎకరాలు భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ చేశారు. కేవలం రంగారెడ్డి జిల్లాలో లక్షలకు పైగా ఎకరాలు పేదలకు పంపిణీ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాలు అసైన్డ్దారుల చేతులో ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 90 వేల ఎకరాల అసైన్డ్ భూమిని రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పట్టాలిస్తామని చెప్పింది. ఆ భూములను ఎన్నో ఏండ్లుగా 1959 నుంచి సర్టిఫికెట్లు పొందిన రైతులు ఆ భూములకు పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. కానీ నేటికీ రైతులకు హక్కులు దక్కడం లేదు.
పట్టాలేమో కానీ లాక్కొంటున్నారు..
అధికారంలోకి వస్తే అసైన్డ్దారుల భూములకు పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ రైతులకు హామీ ఇచ్చింది. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నయో లెక్కలు తీయండి అంటూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తోంది. దాంతో జిల్లాలో అసైన్డ్ భూములను జల్లెడపట్టే పనిలో రెవెన్యూ అధికారులు నిమగమయ్యారు. ‘కొండ నాలుకకు మందువేస్తే.. ఉన్న నాలుక ఊసిపోయనట్లు’ రైతుల పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్కు అధికారం ఇస్తే అసైన్డ్ భూములకు పట్టాలు వస్తాయని ఆశించిన రైతులకు ఉన్న భూములు పోయేట్టు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. జిల్లాలో ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ, ఇండిస్టియల్ కారిడార్, త్రిబుల్ఆర్, రేడియల్ రోడ్లు, హెచ్ఎమ్డీఏ ల్యాండ్ పూలింగ్ ఇలా అనేక విధాలుగా పేదల నుంచి భూములు లాక్కోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ చేపడుతుంది. ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ కోసం ఏర్పాటు చేసిన టీజీఐఐసీ.. వేలాది ఎకరాలు భూసేకరణ చేపట్టింది. భవిష్యత్లో పరిశ్రమలకు, అంతర్జాతీయ పెట్టుబడులకు ల్యాండ్ ఇవ్వడానికి ముందస్తుగా పేదల నుంచి భూములు సేకరిస్తోంది. ఇందులో భాగంగా రైతులకు అసైన్డ్ భూములు ఎక్కడుంటే అక్కడ రెవెన్యూ అధికారులు గద్దల్లా వాలిపోతున్నారు.
అభయ హస్తం మాటలు ఆవిరే..
‘అభయ హస్తం’ మ్యానిఫెస్టో పేరుతో ప్రజల ముందుకు వచ్చిన కాంగ్రెస్.. అభయహస్తం మాటలు అటకెక్కినట్లేనా..! అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రెండున్నరేండ్లు గడస్తున్నా అసైన్డ్ భూముల పట్టాల విషయంలో ఎక్కడా ఒక్కమాట వినిపిస్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలకు విలువ లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం అసైన్డ్ భూములకు పూర్తి స్థాయి హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
అసైన్డ్ భూములకు పట్టాలివ్వాలి
ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ఆ భూములపై సర్వ హక్కులు కల్పించాలి. పట్టా పాసు పుస్తకాలు జారీ చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. అసైన్దారులందరికీ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలి. లేని పక్షంలో భవిష్యత్లో పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు చేపడతాం.
– పగడాల యాదయ్య, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి



