నేటి నుంచి ఈనెల 21 వరకు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన కలెక్టర్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీల్లోని దుకాణాలను వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం బుధవారం నాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 9 నుంచి 21వ తేదీ వరకు క్యూర్ పరిధిలోని 36 డబుల్ బెడ్‌రూం కాలనీల్లో అందుబాటులో 1400కు పైగా షాపులను వేలం వేస్తున్నట్టు తెలిపారు. దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా కాలనీల అభివృద్ధికే వినియోగిస్తామన్నారు. తొలివిడతలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 8 కాలనీల్లోని 273 షాపులకు.
ఈ నెల 9, 10 తేదీల్లో వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటికి కనీస ధరలను కూడా బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా నామమాత్రంగానే నిర్దారించామనీ, ఆసక్తి ఉన్నవారు ఆయా కాలనీలను సందర్శించి, తమకు నచ్చిన, అనువైన దుకాణాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. వేలంపాటలో పాల్గొనదలచిన వారు నిర్ణీత మొత్తం ధరావతు (ఇంఎండి) చెల్లించి వేలం నిర్వహించే తేదీల్లో ఉదయం 11 గంటలలోపు సంబంధిత ఆర్డీవో కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చని వివరించారు. ఆయా కాలనీల్లోని షాపుల విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సహకార సంఘాల చట్టం క్రింద కాలనీ నివాసితుల సంక్షేమ సంఘాలను( వేల్పేర్ అసోసియేషన్లను) ఏర్పాటు చేసి, వాటి ఆధ్వర్యంలో అవే కాలనీల్లో నిర్వహణ-అభివృద్ధికి జాయింట్ అక్కౌంట్ ద్వారా ఈ నిధులను వినియోగిస్తామని స్పష్టంచేశారు.
వేలం ఈ తేదీల్లో…
ఏప్రిల్ 9, 10 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని 8 కాలనీల్లో 273 దుకాణాల వేలం ప్రక్రియ జరుగుతుంది. 15, 16 తేదీల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 10 కాలనీల్లోని 77 దుకాణాలకు, ఏప్రిల్ 15, 17 తేదీల్లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 12 కాలనీల్లోని 892 షాపులకు, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 6 కాలనీల్లోని 372 షాపులకు 15 నుంచి 18వ తేదీ వరకు, మరియు 21 వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తారు. ఈ దుకాణాల విక్రయాలకు సంబంధించిన అదనపు సమాచారం కోసం ఆయా జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్లను సంప్రదించవచ్చని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు.
డబుల్ ఇండ్ల సముదాయాల్లో షాపుల వేలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



