వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టే కాంటా వేసి మిల్లులకు పంపాలి
అవసరమైతే రాత్రి సమయాల్లోనూ కొనుగోళ్లు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రబీ ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని చర్యలు తప్పవని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతును కొనుగోలుదారులు లేదా మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా నల్లగొండ, కనగల్ మండలాల్లో బుధవారం మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దాంతోపాటు ఇదివరకే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. లారీల సమస్య ఉన్నట్టు నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. వెంటనే కాంట్రాక్టర్‌తో మాట్లాడి అవసరమైన లారీలు ఏర్పాటు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం ఆగడానికి వీల్లేదని చెప్పారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎండలను దృష్టిలో ఉంచుకొని కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అదనపు కలెక్టర్, పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ రెవెన్యూ అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ హమాలీలు, ఇతర సదుపాయాల సౌకర్యాల సమస్య లేకుండా ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్నాన్నారు. ఐకెేపీ, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, అత్యధికంగా ధాన్యం దిగుబడి వచ్చే నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. రైస్ మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి రాత్రి సమయంలోనూ ధాన్యం కొనుగోలు చేశాయని అధికారులకు సూచించారు. ఐకెపి మహిళా సంఘాలకు ధాన్యం నిల్వ ఉంచేందుకు 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మిస్తామని చెప్పారు. కలెక్టర్ ప్రతిరోజూ ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలన్నారు.
ఎస్ఎల్బీసీ పూర్తి అయితే ఇంకా ఎక్కువ ధాన్యం పండుతుందన్నారు. రూ.450 కోట్లతో ఎంఆర్పీ కాలువల లైనింగ్ చేపట్టామని, పూర్తిస్థాయిలో కాలువలకు నీరు వస్తే కనగల్ చెరువును నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశం, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డిఆర్డిఓ శేఖర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తదితరులు ఉన్నారు.
రైతులను ఇబ్బంది పెడితే సహించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



