Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ సభకు గ్రీన్‌ సిగ్న‌ల్‌

బీఆర్‌ఎస్‌ సభకు గ్రీన్‌ సిగ్న‌ల్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వనపర్తి జిల్లా రేవన్‌పల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని ధర్నా చౌక్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ గురువారం నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి పోలీసులు విధించిన ఆంక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ జారీ చేసిన అనుమతి రద్దు ఉత్తర్వులను కొట్టివేస్తూ, ముందుగా డీఎస్పీ విధించిన షరతులకు లోబడి సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 3న డీఎస్పీ 26 షరతులతో సభకు అనుమతి ఇచ్చినప్పటికీ, అనంతరం 7న జిల్లా ఎస్పీ ఆ అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకుడు గట్టు యాదవ్‌ హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ విచారించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదిస్తూ, సరైన కారణం చూపకుండా ఎస్పీ అనుమతిని రద్దు చేయడం చట్టవిరుద్ధమనీ, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1) కింద లభించే సమావేశ స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ తరఫున న్యాయవాది స్పందిస్తూ, ఇంటెలిజెన్స్‌ సమాచారం ప్రకారం అనుమతించిన సంఖ్యకంటే ఎక్కువగా 7 నుంచి 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందనీ, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. గత ఘటనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు పరిశీలించిన హైకోర్ట్‌ ఎస్పీ ఉత్తర్వుల్లో సరైన కారణాలు లేవని పేర్కొంది. కేవలం శాంతిభద్రతల కారణంతో అనుమతి రద్దు చేయడం సముచితం కాదని స్పష్టం చేసింది. ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంటే పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు ఎస్పీ ఉత్తర్వులను రద్దు చేసి, డీఎస్పీ విధించిన షరతులతో సభ నిర్వహణకు అనుమతిచ్చింది.

అనాధల పేరిట నిధుల దుర్వినియోగం
అనాధ పిల్లల పేరిట విదేశీ నిధులు సేకరించి దుర్వినియోగం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలపై తెలంగాణ హైకోర్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుంబం ఉన్న పిల్లలను కూడా అనాధలుగా చూపిస్తూ నిధులు సేకరిస్తున్నట్టు కోర్టు వ్యాఖ్యానించింది. ఓఎం గ్రూప్‌ ఆఫ్‌ చారిటీస్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఆ సంస్థ ఆస్తులను అన్యాక్రాంతం చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్‌ న్యాయవాది వాదిస్తూ, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘన జరుగుతోందని పేర్కొన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. వాదనల అనంతరం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖలు, సీబీఐ, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

సీబీఐ కోర్టులో తేల్చుకోండి
విదేశీ ఖాతాలకు నిధుల బదిలీ, కొత్త బ్యాంకు ఖాతాల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలంటూ జగతి పబ్లికేషన్స్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తిరుమలాదేవి కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీజ్‌ చేసిన ఖాతాల విషయంలో జగతి సంస్థ పిటిషన్‌ వేసింది. ప్రధాన పిటిషన్‌పై తీర్పు చెప్పాక మధ్యంతర పిటిషన్‌ చెల్లదని న్యాయమూర్తి తేల్చారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా న్యూస్‌ ప్రింట్‌ కొనుగోలుకు విదేశీ ఖాతాలకు నిధులు బదిలీ చేయాల్సిన అవసరం ఉందనే వివాదాన్ని సీబీఐ కోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన చేశారు.

పవన్‌ ఖేరా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు
అస్సాం రాష్ట్రంలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అస్సాం సీఎం హిమంత్‌ బిశ్వ శర్మ భార్య ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె. సుజన గురువారం విచారణ చేపట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -