Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబంగినపల్లి మామిడికి మార్కెట్‌ ఏదీ?

బంగినపల్లి మామిడికి మార్కెట్‌ ఏదీ?

- Advertisement -

– అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్నా.. అమ్మకాలకు ఆపసోపాలు
– మార్కెట్‌ లేక దళారుల చేతుల్లోకి పంట
– గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న మామిడి రైతులు
– స్థానికంగా మార్కెట్‌ వ్యవస్థ కల్పించాలని విజ్ఞప్తి
బంగినపల్లి మామిడి పండ్లు అనగానే.. కొల్లాపూర్‌ మామిడి పండ్లు గుర్తుకు వస్తాయి. అంతర్జాతీయ గుర్తింపు కల్గిన కొల్లాపూర్‌ బేనీషాన్‌కు స్థానికంగా మార్కెట్‌ వ్యవస్థ, కోల్ట్‌ స్టోరేజ్‌ లేకపోవడం పట్ల మామిడి రైతులు మంచి ధర అందక మోసపోతున్నారు. మిగతా పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరతోపాటు మామిడికి మార్కెట్‌ వ్యవస్థ కల్పించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి దిగుబడికి స్థానిక మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ప్రాంతీయప్రతినిధి
కొల్లాపూర్‌ బేనీషాన్‌ పండ్ల తోటలను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా సాగు చేశారు. అయితే, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఆటుపోట్లు.. మార్కెట్‌ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోల్డ్‌ సోరేజీలు పెడితే మామిడి పండ్లు మన్నికగా ఉంటాయి. మామిడి కాయలను హైదరాబాద్‌, ముంబయి వంటి ప్రాంతాలకు తీసుకెళ్లడం రైతులకు ఖర్చుతో కూడిన పని. హైదరాబాద్‌లో దళారుల చేతుల్లో నిలువునా మోసపోతున్నారు. 2017-18లో రూర్భన్‌ స్కీంలో రూ.4.30 కోట్ల అంచనాలతో ఇంటిగ్రేటెడ్‌ మ్యాంగో పాకింగ్‌ హౌజ్‌ నిర్మాణానికి కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలాన్ని ఎంపిక చేశారు. స్థలం ఎంపికకే మూడేండ్లు పట్టింది. కార్పాముల గ్రామంలో రెండెకరాలు సేకరించారు. రెండు కోట్లు యంత్రాలకు కేటాయించారు. మార్కెట్‌ శాఖ ఆధ్వర్యంలో గోదాములు, మిషనరీలు ఏర్పాటు చేయాల్సింది. వివిధ రకాల మామిడి కాయలను గ్రేడింగ్‌ చేసి వాషింగ్‌, ప్యాకింగ్‌ అనంతరం ఎక్స్‌పోర్టుకు పంపాల్సి ఉంటుంది. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని పాలకులు గతంలో హామీ ఇచ్చారు. కొల్లాపూర్‌ పట్టణం సమీపాన రాంపూర్‌ వద్ద 8 ఎకరాలలో మార్కెట్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం భూమి సేకరిస్తున్నామని కూడా చెప్పారు. ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు.
ధరలేక..
మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధి విధానాలు రూపొందించడంలో పాలకులు విఫలమౌతున్నారు. మార్కెటింగ్‌ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులే డీసీఎంలు, టిప్పర్ల ద్వారా మామిడిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీంతో ఖర్చు భారం పెరిగిపోతున్నది. రెండు మూడు రోజులైనా.. హైదాబాద్‌లో వ్యాపారులు కొనడం లేదు. ఆలస్యమైతే రంగు మారడం, పండ్లు కావడం చేత ధర పలకడం లేదు.
దిగుబడి ఇలా..
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మామిడి సాగు అధికంగా ఉంది. ప్రధానంగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో బంగినిపల్లి మామిడి తోటలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 8,298 మంది రైతులు 26,238 ఎకరాలలో మామిడి తోటలను సాగు చేస్తూ.. 104952 టన్నుల మామిడి దిగుబడి తీస్తున్నారు. వనపర్తి జిల్లాలో 4423 మంది రైతులు 11793 ఎకరాలలో 47172 టన్నులు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2288 మంది రైతులు 11,080 ఎకరాలో 44320 టన్నుల దిగుబడి తీస్తున్నారు. గద్వాల జిల్లాలో 1321మంది రైతులు 4930 ఎకరాలలో తోటలు సాగు చేస్తూ 19720 టన్నులు, నారాయణపేట జిల్లాలో 954 మంది రైతులు, 3303 ఎకరాలు 13212 టన్నుల దిగుబడి తీస్తున్నారు.

క్వింటాలైనా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలి : లక్ష్మయ్య, రైతు, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా

మామిడి దిగుబడిని అమ్ముకోవడం కష్టంగా మారింది. కొన్ని క్వింటాళ్లు అయినా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. బంగినిపల్లి మామిడికి స్థానిక మార్కెట్‌తోపాటు నిల్వ గిడ్డంగులు ఏర్పాటు చేస్తే రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మిగతా పంటల మాదిరిగానే మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి. మామిడి సాగులో ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -