Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్థిక సంక్షోభాల పట్ల మోడీ మౌనం వీడాలి

ఆర్థిక సంక్షోభాల పట్ల మోడీ మౌనం వీడాలి

- Advertisement -

ఆర్థిక అస్థిరత్వంపై అవాస్తవాల ప్రచారం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల

దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక వాల్మీకి కమ్యూనిటీ హాల్లో బుధవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్‌ నరసింహ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జాన్‌వెస్లీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాలను నివారించడంలో దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఇరాన్‌పై సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్‌ చేసిన దాడులపై స్పందించకుండా రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నదని అన్నారు. వలసవాద సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకిస్తున్నామని ధైర్యంగా చెప్పలేని మోడీ ప్రభుత్వానికి దేశ సార్వభౌమత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోతున్నా పట్టించుకోకుండా.. ఆర్థిక అస్థిరత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, దారిద్య్రం వంటి సమస్యలను గాలికి వదిలేసి వివిధ వర్గాల పట్ల విద్వేష రాజకీయాలతో అశాంతిని సృష్టిన్నారని విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.శ్రీరామ్‌ నాయక్‌, వెంకట్రాములు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేరళంకు వెళ్లి సీఎం రేవంత్‌ రెడ్డి నాటకాలు ఆడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, మహిళలకు రూ.2500, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం లాంటి ఏ ఒక్క హామీనీ అమలు చేయని అసమర్థ సీఎం.. దేశానికి ఆదర్శంగా నిలిచిన కేరళం రాష్ట్రాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. హామీలు అమలు చేయడం చేతకాక అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజా పోరాటాల ద్వారా బుద్ధి చెబుతామన్నారు. కేరళం తరహాలో మొత్తం ప్రజానీకానికి ఉచిత విద్య అందించే దమ్ము ధైర్యం రేవంత్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి, నాయకులు జి.రాజు, పరం జ్యోతి, వీవీ నరసింహ, మద్దిలేటి, ఈదన్న, నర్మదా, రమేష్‌, విజరు కుమార్‌, రాముడు, నరసింహులు, నరేష్‌, మంచాల నరసింహ, వెంకటేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -