Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి

పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి

- Advertisement -

కనీస మద్దతు ధర, కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన రైతు కమిషన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వరిపై ఆధారపడటాన్ని తగ్గించి చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజల పంటలకు ధరల హామీ, మార్కెట్‌ సౌకర్యాలను బలోపేతం చేసి పంటల వైవిధ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు కమిషన్‌ కోరింది. తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఆధ్వర్యంలో ”తెలంగాణలో వ్యవసాయ పరిస్థితి – ప్రస్తుత స్థితి, భవిష్యత్తు” అంశంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించేందుకు గానూ బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో రైతు కమిషన్‌ సమావేశం జరిగింది. అందులో రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్‌, కేవీఎన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, భూమి సునీల్‌, భవానీ రెడ్డి తోపాటు, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, వ్యవసాయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ నర్సింగరావు, హార్టికల్చర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సరోజినీ దేవి, ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త హరికిషన్‌, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖ, రైతు కమిషన్‌ అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ రంగ ప్రస్తుత పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, 2034 – 2047 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు వ్యూహాలపై సమగ్రంగా చర్చ జరిగింది. మట్టి ఆరోగ్యం మెరుగుదల, సహజ మరియు సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం, పంటల వైవిధ్యం, కనీస మద్దతు ధర, కొనుగోలు వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. విత్తనాల నాణ్యత పెంపు, ఆర్‌అండ్‌డీ పర్యవేక్షణ బలోపేతం, రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. హార్టికల్చర్‌ విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ, అధిక ఆదాయం కలిగించే పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించడం, క్లస్టర్‌ ఆధారిత సాగు, విలువ ఆధారిత ఉత్పత్తులు, కోల్డ్‌ చైన్‌, స్టోరేజ్‌ సదుపాయాల అభివృద్ధి అవసరమని అభిప్రాయపడింది.

మార్కెట్‌ లింకేజీలు బలోపేతం చేయడం, గ్రామ స్థాయిలో మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంపు సాధ్యమని సూచించింది.కౌలు రైతుల గుర్తింపు, వారికి రుణాలు, బీమా, ప్రభుత్వ పథకాల అందుబాటు పెంపు, మహిళా రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడం, గ్రామీణ ఉపాధి అవకాశాల విస్తరణపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. జీవ వైవిధ్యం పరిరక్షణ, అడవి జంతువుల వల్ల పంట నష్టం తగ్గించడం, పంట అవశేషాల నిర్వహణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంట ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచించింది.అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్‌ నివేదిక అందజేయనున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -