Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్టీ సర్టిఫికెట్‌ జారీలో సరళమైన విధానాన్ని అమలు చేయాలి

ఎస్టీ సర్టిఫికెట్‌ జారీలో సరళమైన విధానాన్ని అమలు చేయాలి

- Advertisement -

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గిరిజన యువతను ప్రభావితం చేస్తున్న కుల ధ్రువీకరణ సమస్యలపై హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌తో సంప్రదించి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని అధికారులను రాష్ట్ర ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆదేశించారు. ఇకపై ధ్రువీకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరళమైన విధానాన్ని అమలు చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, అటవీ శాఖ అధికారులు, గిరిజన ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక రవాణా సమస్యలు గిరిజనులకు అడ్డంకి కాకూడదని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైన చోట ప్రత్యేక అనుమతులు ఇచ్చి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అలాగే తాగునీటి సమస్య నివారణకు కొత్త బోర్లు తవ్వడం, పాత వనరులను పునరుద్ధరించడం చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు. గిరిజన గ్రామాలను స్వయంగా సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానని తెలిపారు. ఈ నెలాఖరులోగా గిరిజన ప్రాంతాల్లో ముఖ్య సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు ప్రారంభించాలని మంత్రి గడువు విధించారు.

ఒక ప్రాంత సమస్యను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. పేద గిరిజనులు నివసించే ప్రతి ప్రాంతానికి చేరుకునే త్రోవ (రోడ్డు), నివసించేందుకు గూడు (ఇల్లు), అడవుల్లో చీకట్లు తొలగించే విద్యుత్‌ సౌకర్యం( కరెంటు), తాగునీటి కోసం బోర్లు వంటి ప్రాథమిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, అమలు దశలో ఎదురవుతున్న అడ్డంకులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలంటే శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని స్పష్టం చేశారు.

నిధులు ఉన్నా పనులు జరగకపోవడం సహించబోమని హెచ్చరించారు. అటవీ భూములు, పోడు సాగు, ఫారెస్ట్‌ రైట్స్‌ చట్టం కింద హక్కుల పత్రాల జారీ విషయంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ చట్టం ప్రకారం వారికి ఎక్కడ వీలైతే అక్కడ వ్యవసాయం చేసుకునేలా సాగు భూమిని అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సువర్ణ , ఎమ్మెల్యేలు బాలు నాయక్‌, రామచంద్ర నాయక్‌, డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ, మురళి నాయక్‌, కోవ లక్ష్మి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, డిఎఫ్‌ఓలు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -