నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఎమ్మార్పీఎస్ రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున భువనగిరి శాసనసభ్యులు కుంభం నివాసంలో దళితులకు చిన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయ హస్తం ద్వారా రూ.12 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని, ఎస్సీ కార్పొరేషన్ కు 15 వేల కోట్ల రూపాయలు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యాసంస్థలలో 25% ఉచిత విద్యను ప్రభుత్వం కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని కోరారు.
వీటితోపాటు పారిశుద్ధ్య కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో ప్రస్తావించి దళితుల అభివృద్ధికి సహకరించగలరని జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ మాదిగ, జిల్లా ఇన్చార్జి కూరెళ్ల రమేష్ మాదిగ, రాష్ట్ర యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాశగల్ల రమేష్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల ఉప్పలయ్య,రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘీ స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఇటికాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొంపల్లి భాస్కర్ లు పాల్గొన్నారు.



