Wednesday, August 26, 2026
E-PAPER
Homeమానవిఆ చిన్న అలవాట్లే...

ఆ చిన్న అలవాట్లే…

- Advertisement -

ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటారు. అయితే ఎవరి జీవితం ఒక్కరోజులో మారిపోదు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా మీ డైలీ లైఫ్​ స్టైల్​లో కొన్ని అలవాట్లను భాగం చేసుకోవాలి. రోజూ చేసే ఆ చిన్న చిన్న పనులే ఏడాది పూర్తయ్యే సరికి మంచి ఫలితాలను ఇస్తాయి. మరి, జీవితాన్ని మార్చే ఆ చిన్న అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.

 కొంతమందికి ‘పుస్తక పఠనం’ అంటే చాలా ఇష్టం. మరికొందరు మాత్రం అంతగా ఇష్టపడరు. మీరూ ఆ జాబితాలో ఉంటే ఇప్పుడే ఆ అలవాటును మార్చుకోవడం మంచిది. ప్రతి రోజూ కనీసం మీకు నచ్చిన బుక్​లో పది పేజీలు చొప్పున చదవడం అలవాటు చేసుకోండి. నెలకు ఒక్క పుస్తకం పూర్తి చేయొచ్చు. అంటే ఏడాదికి 12 పుస్తకాలు. ఈ చిన్న అలవాటు వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది.  నిత్య జీవితంలో పొదుపు మంత్రాన్ని అలవాటు చేసుకోవాలి. అందులో భాగంగా రోజుకు కనీసం రూ.50 పొదుపు చేయండి. ఏడాదికి రూ.18 వేలకు పైగా జమవుతాయి. ఆ మొత్తాన్ని వినోదం, విహారానికి వినియోగించుకోవచ్చు. లేదంటే అత్యవసర నిధిలో జమ చేయొచ్చు. ఈ అలవాటుతో ఆర్థిక క్రమశిక్షణ కూడా పెరుగుతుంది.  రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేస్తే చాలు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. దాంతో భావోద్వేగాలు కంట్రోల్​లో ఉంటాయి. ఏడాదికి 61 గంటల మానసిక ప్రశాంతత లభించినట్లవుతుందని చెబుతున్నారు.

 వ్యాపారం లేదా వృత్తితో సరిపెట్టొద్దు. వంటలు, కోడింగ్ ఇలా వారానికో నైపుణ్యం నేర్చుకోవాలి. దీంతో ఏడాదికి 52 కొత్త నైపుణ్యాలు మీ సొంతమవుతాయి. అవి మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి.  మానవ సంబంధాలు పెంచుకోవాలి. వారానికో కొత్త వ్యక్తిని పరిచయం చేసుకోండి. అలా సంవత్సరంలో 52 మందితో పరిచయాలు ఏర్పడతాయి. దీంతో ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయంటున్నారు. అలాగే మీ వృత్తిపరమైన నెట్​వర్క్ పెరుగుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.  కుటుంబసభ్యుులు లేదా సహోద్యోగులు ఇలా రోజుకొకరిని ప్రశంసించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఏడాదిలో 365 మంది చిరునవ్వు, సంతోషానికి కారణమవుతారు. వారితో బంధాలు బలపడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు.
 రోజులో ఒక చిన్న విజయాన్ని సాధించడానికి ప్రయత్నించండి. బాస్ ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడం, భాగస్వామి లేదా పిల్లలు కోరిన పని చేసి పెట్టడం వంటివి చేస్తూ ఉంటే సంవత్సరం పూర్తయ్యే సరికి మీలో పురోగతి, ఎదుగుదల మీకే స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ మీకు చూడటానికి పెద్ద లక్ష్యాలుగా కనిపించకపోవచ్చు. కానీ ప్రతి రోజు వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, జ్ఞానం పెరుగుతాయి. భవిష్యత్తులో అసాధారణ ఫలితాలను ఇస్తాయంటున్నారు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఇప్పటి నుంచే రోజువారీ జీవితంలో ఈ చిన్న చిన్న మార్పులను పాటించండి. మీ పురోగతికి బాటలు వేసుకోండని నిపుణులు సలహా ఇస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -