అర్హతలు లేకున్నా డాక్టర్లుగా చెలామణి
భారీగా మందులు, పరికరాలు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎలాంటి అర్హత లేకపోయినా డాక్టర్లుగా చెలామణి అవుతూ, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆరుగురు నకిలీ వైద్యులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నకిలీ, గడువు ముగిసిన మందులు, వైద్యాధికార పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపిన ప్రకారం.. మధురానగర్‌కు చెందిన డి. రామశేఖర్ రెడ్డి ఆయన భార్య నాగజ్యోతి పేరుపై(డి-ఫార్మసీ) ‘శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ను నడిపిస్తూ వైద్యం చేస్తున్నారు. ఆ సెంటర్‌పై టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని విచారించడంతో వైద్యులుగా చెలామణి అవుతున్నారని తేలింది. వారిచ్చిన సమాచారం మేరకు డిప్లామా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ పూర్తిచేసి వైద్యం చేస్తున్న రాగం సుధాకర్‌ను, నర్సుగా పనిచేసిన మిరుదొడ్డి భారతి, కాటిక మహేష్ రావును అరెస్టు చేశారు. రోజుకు 40-50 మంది రోగులను పరీక్షిస్తున్న వీరు రూ.200 ఫీజు వసూలు చేస్తున్నారని విచారణలో తేలింది. వారి నుంచి ఇంజెక్షన్లు, బటర్ ఫ్లై నీడిల్స్, గడువు ముగిసిన ట్రామడాల్ ఇంజెక్షన్లు, 30 పెద్ద సెలైన్ బాటిళ్లు, సర్జికల్ కత్తెర్లను, పారాసిటమాల్ పీడియాట్రిక్ సిరప్లు, యాంటీబయోటిక్స్, ప్రెగ్నెన్సీ కిట్లు, బీపీ మెషిన్, స్టెతస్కోప్, సెలైన్ ఇంఫ్యూజన్ సెట్లు, డిస్పో వ్యాన్ సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ కోసం ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.
రెహమత్నగర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలను నిర్వహించి మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరైన అర్హతలు లేకుండా క్లినిక్‌లు నడిపిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు నిర్వహిస్తూ, రోగులకు ఐవీ సెలైన్లు, ఇంజెక్షన్లు ఇవ్వడమే కాకుండా సర్జికల్ కుట్లు (స్టిచెస్) వేస్తూ ప్రాణాపాయం కలిగిస్తున్నారు. ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సిహెచ్.యాదేందర్, ఎస్ఐలు మహమ్మద్ జాహెద్, జి.సందీప్ రెడ్డి, డి.రవి రాజ్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఆరుగురు నకిలీ వైద్యుల అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



