Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలి

జనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలి

- Advertisement -



సీఎం ప్రజావాణిలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జనగామ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఐసీడీఎస్ లో కొత్త రకమైన శిశు, మహిళా సమృద్ధి యాప్ ను తీసుకువచ్చి అంగన్వాడీ టీచర్లను, వర్కర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి తెలిపారు. అంగన్వాడీలకు పని భారం పెంచే కొత్త రకమైన యాప్ ను రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో జనగామ జిల్లా కలెక్టర్ తీసుకొచ్చిన శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ సీఎం ప్రజావాణి చైర్మెన్ చిన్నారెడ్డికి యూనియన్ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా జనగామ జిల్లా కలెక్టర్ ఆగస్టు 20న ఐసీడీఎస్ లో కొత్త యాప్ ను తేవడం సరికాదని తప్పుపట్టారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హెచ్ టీ ఎస్, కేంద్ర ప్రభుత్వం పోషణ్ ట్రాకర్ యాప్ ల ద్వారా ఐసీడీఎస్ లోని అంగన్వాడీలు సేవలు అందిస్తున్నారని ఒకే రకమైన పనిని 3 యాప్ లలో చేయడం అంటే పని భారం పెరగడమేనని జయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త యాప్ తో అంగన్వాడి నిజాయితీని తప్పుపట్టే విధంగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్ ల ద్వారా సేవలందిస్తున్న అంగన్వాడీలకు కొత్త యాప్ తో పని భారం పెరగడం తప్ప అదనపు ప్రయోజనం ఉండదని తెలిపారు. ఇప్పటికే ఉన్న యాప్ ల ద్వారా ఎఫ్ఆర్ఎస్ తో పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలకు, పిల్లలకు అందిస్తూ నిరంతరం సలహాలు, సూచనలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక సంక్షేమ పథకాలతో పాటు బీఎల్ఓ, సర్ లాంటి అదనపు డ్యూటీలు చేస్తూ అంగన్వాడీ కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
ప్రతి నెల చివరి వారంలో సెక్టార్ సమావేశాల్లో ఫుడ్ కు సంబంధించిన రికార్డులను సమర్పిస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్ లలో రిపోర్టులు, రిజిస్టర్లను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు.

జనగామ జిల్లాలో ఇప్పటికే సుమారు 187 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని జయలక్ష్మి తెలిపారు. మరుగుదొడ్ల సౌకర్యం సరిగ్గా లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వంట పాత్రలు సరిగ్గా లేక సొంత డబ్బులతోనే వంట పాత్రలు తెచ్చి పిల్లలకు ఆహారాన్ని వండి పెడుతున్నారని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులైన తాగునీరు, కరెంటు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సెంటర్లలో బీరువాలు, ఫర్నిచర్లు అందుబాటులో లేక రికార్డులు వంట సామాగ్రి భద్రపరచుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.సంవత్సరాల తరబడి వంట గ్యాస్ బిల్లులు, కూరగాయల బిల్లులు, అద్దె భవనాల పెండింగ్ బిల్లులు రావట్లేదనీ,.టిఏ, డిఏ ల ఊసే లేదనీ, అంగన్వాడీ కేంద్రాలకు ప్రహరి గోడ లేక సెక్యూరిటీ లేకుండా పోయిందని ఆసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం జయలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. తమ వినతికి చిన్నారెడ్డి స్పందించారని తెలిపారు. జనగామ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి కొత్తగా తెచ్చిన యాప్ ను రద్దు చేయాలని చెప్పారని వెల్లడించారు. అందుకు కలెక్టర్ తన వద్దకు పంపిస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటానని బదులిచ్చినట్టు పేర్కొన్నారు. ఐసీడీఎస్ డైరెక్టర్ ఆఫీసులో జాయింట్ డైరెక్టర్ మోతికి కూడా ఇదే విషయంపై విన్నవించగా ఆమె సంబంధిత కలెక్టర్ తో మాట్లాడుతానని తెలిపారన్నారు. ఐసీడీఎస్ డైరెక్టర్ , ప్రిన్సిపల్ సెక్రెటరీ శృతి ఓజాకు విన్నవించగా, జనగాం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సుంచు విజేందర్, జిల్లా కార్యదర్శి బైరగోని అంజూమ్, జిల్లా ఉపాధ్యక్షులు పి.బిక్షం, కొమ్ము మంగ, జి.అమరావతి, సహాయ కార్యదర్శి ఎర్రబెల్లి సంతోష, బి.శోభ, గంధమల్ల జ్యోతి, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి, ఇందిరా, సుమతి, బత్తిని శ్రావణి, కోమల, అరుణ, రజిత, రేణుక, మల్లిక, సుకన్య, రజిత, సుజాత, స్వర్ణ, లక్ష్మీ నర్సమ్మ, మానస, అపర్ణ,యాకమ్మ, ఎలేంద్ర ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -