Friday, April 10, 2026
E-PAPER
Homeమానవిమహానేత మల్లు స్వరాజ్యం

మహానేత మల్లు స్వరాజ్యం

- Advertisement -

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వీర తెలంగాణ విప్లవ ప్రజాపోరాటంలో 12 ఏండ్ల పసిప్రాయంలోనే అడుగుపెట్టిన ధిశాలి మల్లు స్వరాజ్యం. ముందుగా తాను నివసించిన గ్రామంలోనూ అనంతరం తన చుట్టూ ఉన్న గ్రామాలలోనూ, తన చిన్నారి గొంతుకతో పేద ప్రజలను ఉత్తేజపరిచారు. బానిసలుగా బతికేకన్నా చావటం మేలని, తన నోటికి వచ్చిన అక్షరాలతో పాటలు పాడుతూ నిరుపేద రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను మేల్కొల్పిన వీరనారి. అమరజీవి, మన ప్రియతమ నేత సుందరయ్య తర్వాత అంతటి మహానాయకురాలు ఆమె. గత నెల 19న ఆమె నాలుగవ వర్ధంతిని జరుపుకున్నాం.

నాలుగేండ్లు అడవులలో అజ్ఞాతవాసం గడుపుతూ, నిజాం ప్రభుత్వాన్ని గడగడ లాడించిన యోధురాలు. సుందరయ్య నిర్మించిన పార్టీకి కోటాను కోట్ల సంపద ఆమె జీవితం. అసాధారణ వ్యక్తిత్వం ఆమె సొంతం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పార్టీ రాష్ట్ర కమిటీ నిర్మించిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి, ఆనాటి హౌం మినిష్టర్‌ సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించారు. ఆ సందర్భంలో ప్రారంభోత్సవ సభలో స్వరాజ్యం మాట్లాడుతూ మినిష్టర్‌ను హెచ్చరిస్తూ ఒక ముఖ్య విషయం అడిగారు. ‘పథకాల రూపంలో ప్రజలకు మీరు పెట్టే ఆ ఎంగిలి మెతులు మాకొద్దు. పేద ప్రజలకు, నిరుపేద రైతాంగానికి భూములు పంచండి. అది ఈనాటి మెజారిటీగా ఉన్న పేద ప్రజలు కానీ, ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నేత మా సుందరయ్య కానీ కోరినది ఇదే’ అని గంభీరంగా ప్రభుత్వాన్ని కోరారు. అలా నిత్యం పేదల కోసం తపించిన ధన్యజీవి ఆమె.

నడవలేకపోయినా…
తన చివరి రోజులలో తన కొడుకుల వద్ద ఉండమన్నా స్వరాజ్యం ఉండలేదు. ‘నాకు నిత్యం ప్రజలతో కలసి ఉండటమే ఇష్టం’ అని అందరికీ అందుబాటులో ఉండేందుకు ఐద్వా ఆఫీసులోనే నివసించారు. తనే స్వయంగా వంట చేసుకొని తింటూ నడవలేకపోయినా, కాలు విరిగినా కర్ర పట్టుకొని నడుస్తూ మీటింగ్‌లకు హాజరయ్యేవారు. వారం రోజులకు ఒకసారో, అవసరమయితే నాలుగు రోజులకే ఆమె చిన్న కొడుకు నాగార్జునరెడ్డి వచ్చి తల్లి దగ్గర ఉండి తన అవసరాలు చూసి వెళ్లేవారు. ఐలమ్మ భవన్‌ నిర్మాణంలో మల్లు స్వరాజ్యం పాత్ర కీలకమైనది. ఆనాటి హౌం మినిస్టర్‌ జానారెడ్డి సహాయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మోటూరు ఉదయం భవన్‌గా దీన్ని నిర్మించారు. జానారెడ్డి, మల్లు స్వరాజ్యం భర్త చిన్ననాటి స్నేహితులు. ఆ పరిచయంతో స్వరాజ్యం అడిగిన వెంటనే ఆయన స్థలం కేటాయించారు. ఆయన్ని కలవటానికి వెళ్లినపుడు స్వరాజ్యంతో పాటు నేనూ, ఇందిర కూడా ఉన్నాము. భవనం నిర్మించేందుకు నిధులు వసూలు చేయడంలో కూడా ఆమె ఎంతో శ్రమించారు.

ప్రభుత్వాన్ని డిమాండు చేసి…
స్వతంత్ర భారత చరిత్రలోనే మల్లు స్వరాజ్యం వంటి మహిళా నాయకురాలు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఈనాటి పనికి ఆహార పథకం విధానాన్ని ఆమె కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ నాయకురాలిగా, ఆనాటి కాంగ్రెసు ప్రభుత్వాన్ని డిమాండు చేసి, ఆమోదింపచేసిన మహానేత. అటువంటి నాయకురాలి గుర్తుగా రాజధాని హైదరాబాద్‌లో ఏమీ లేకపోవడం బాధాకరమైన విషయం. గతంలో హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లో నిర్మించిన లీలా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వంటి భవనం వలె హైద్రాబాద్‌లో మల్లు స్వరాజ్యం విజ్ఞాన కేంద్రం నిర్మించటం, అందులో మంచి లైబ్రరీ వగైరా ఏర్పాటు చేయడం చాలా అవసరం అని నా భావన.

ఉత్తేజకర ఉపన్యాసంతో…
స్వరాజ్యం మా పశ్చిమగోదావరి జిల్లా మొదటిసారిగా గోదావరిలంక భూముల పోరాటం సందర్భంగా వచ్చారు. ఆ గ్రామంలో మత్స్యకార్మికులు ఎక్కువగా ఉండేవారు. అప్పట్లో మా జిల్లా మత్స్య కార్మిక సంఘం నిర్మాత అయిన నాగయవర్మను భూస్వాములు అత్యంత దుర్మార్గంగా హత్య చేశారు. ఆయన సంతాప సభకే స్వరాజ్యం వచ్చారు. నేనూ స్వరాజ్యం కలిసి భీమవరంలోని పెద్ద కాలవలో పడవ మీద నాగయవర్మ గ్రామం వెళ్లాము. అక్కడి ప్రజలందరూ శోక సంద్రంలో ఉండగా సంతాప సభలో స్వరాజ్యం ఉపన్యాసం ఇస్తూ ‘భూస్వాములందరితో నాగలి పట్టించే వరకు అందరం పోరాడదాం. దున్నేవాడిదే భూమి అనే నినాదం ఇస్తూ మీరు పోరాటం సాగించాలి. మీకు అండగా మేము ఉంటాం, ఎప్పటికైనా న్యాయమే విజయం సాధించగలదు. అన్యాయం దుష్ట విధానాలు ఎల్లకాలం సాగవు’ అని తన గంభీర స్వరంతో ఆమె ఇచ్చిన ఉపన్యాసంతో ఆ పల్లె ప్రజలందరిలో ఉత్తేజం వచ్చింది. ఆనాటి స్వరాజ్యం సందేశం ఇప్పటికీ నాకు చెవుల్లో మ్రోగుతూనే ఉంది.

ఆమె గుర్తుగా ఓ విజ్ఞాన కేంద్రం
స్వరాజ్యం రెండవ సారి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1986లో జరిగిన మహిళా సంఘం రాష్ట్ర మహాసభకు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ నుండి కనకముఖర్జీ ప్రధాన వక్తగా వచ్చారు. ఆ సభలల్లో స్వరాజ్యం ఇచ్చిన ఉత్తేజకర ప్రసంగంతో 20 వేల మంది స్త్రీ, పురుషులు లేచి నిలబడి ఆమెకు రెడ్‌ సెల్యూట్‌ చెప్పారు. అటువంటి గొప్ప నాయకురాలు స్వరాజ్యం. ఇప్పటికి ఆమె అస్తమించి నాలుగేండ్లు అవుతుంది. అలాంటి మహానాయకురాలి గుర్తుగా హైదరాబాద్‌ నగరంలో ఓ భవనాన్ని ఏర్పాటు చేసి అది అందరికీ ఉపయోగపడే విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

  • అల్లూరి మన్మోహిని.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -