నమక్‌హరామ్ (నమ్మక ద్రోహి)లకు మానం, మర్యాద, సిగ్గూ ఎగ్గూ ఉండవు. ఎంతకైనా తెగించే దుర్మార్గానికి పాల్పడతారు.అలాంటి వారిని పాలుతాగి రొమ్ము…..బాపతు అంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ‘అతని బతుకే అంత , ఏ మాట, ఏ చేతనూ నమ్మటానికి లేదని’ ఇరాన్ మొదటి నుంచీ మొత్తుకుంటున్నది. చరిత్ర చెప్పిన సత్యం. అయినప్పటికీ యావత్ ప్రపంచం పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలకాలని వాంఛిస్తున్నది గనుక ట్రంప్‌తో అవగాహన, తదుపరి ఒప్పందం చేసుకోవటానికి అంగీకరించింది. మీడియాలో వచ్చినట్లు దీనివెనుక చైనా సలహాకూడా ఉండివుండవచ్చు. మంచి కోరుకొనే వారెవరైనా అలాంటి సలహాలే ఇస్తారు. ఆ ఒప్పంద వార్తలను అందరూ చదవకముందే, ఆ మాటలు చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉండగా కొద్ది గంటల్లోనే ఉల్లంఘించి ఇజ్రాయిల్‌తో దాడులు చేయిస్తున్నాడు. దానికి ప్రతిగా ఇరాన్‌కూ దెబ్బకు దెబ్బతీయక తప్పటం లేదు. ఇరాన్ అందచేసిన పది అంశాలు, అమెరికా ముందుంచిన పదిహేను అంశాల్లో ఏవైనా సందేహాలుంటే మధ్యవర్తుల ద్వారా వాటిని నిర్ధారించుకోవాలి. కానీ, లెబనాన్‌పై దాడులు నిలిపివేయాలని ఒప్పందంలో లేదంటూ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తొలుత ప్రకటించి భీకరదాడులు చేయిస్తున్నాడు.
ఆ దుర్మార్గుడికి మద్దతుగా నిజమే అంటూ అదొక ప్రత్యేక తగాదా అని, పొరపాటుగా అర్ధం చేసుకున్నట్లు ఉందని డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పచ్చి అబద్దాలు చెప్పారు. ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ ఒప్పందం గురించి విలేకర్ల సమావేశంలో స్పష్టంగా ప్రకటించాడు. ఇజ్రాయిల్ దుష్ట చర్యను గురువారం నాడు షరీఫ్ తీవ్రంగా ఖండించాడు. ఈ దుష్టత్రయం ఎందుకు మాట మార్చినట్లు? ఏం సాధించారని కాల్పుల విరమణకు అంగీకరించారంటూ యావత్ ప్రపంచం, అమెరికాలో స్పందనలు వెల్లువెత్తటంతో ట్రంప్‌కు దిక్కుతోచి ఉండదు. అందుకే ఇజ్రాయిల్ ముసుగులో దాడులు కొనసాగించేందుకు ట్రంప్ నిర్ణయించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నిండా మునిగిన ఇరాన్‌కు పోయేదేమీ లేదు, అమెరికా కోసం అంగలార్చేవారు కూడా ఒకటికి పదిసార్లు కుక్కతోక పట్టుకొని గోదారిని ఈదగలమా అని ఆలోచించక పోరు. ప్రపంచానికి కావాల్సింది కూడా అదే.
డోనాల్డ్ ట్రంప్ ఆ ”పుణ్యం” కట్టుకున్నందుకు నిజంగా ”అభినందించాల్సిందే” మరి!ఇస్లామాబాద్‌లో ఇంకా చర్చలు ప్రారంభంగాక ముందే తమ ప్రతిపాదనల్లో మూడు అంశాలను అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్‌పై దాడులు, తమ గగనతలాన్ని అతిక్రమించి డ్రోన్ల ప్రయోగం, యురేనియంను శుద్ధిచేసే తమ హక్కును కాదనటంగా పేర్కొన్నది. ఇరాన్‌కు ఆయుధాలు ఇచ్చేవారి తాటతీస్తానని కూడా ట్రంప్ నోటితుత్తరను బయటపెట్టుకున్నాడు. అమెరికా ఉల్లంఘనల కారణంగా హార్ముజ్ జలసంధిని తిరిగి ఇరాన్ మూసివేసింది. తమ అనుమతి ఉన్న నౌకలకు అనుమతి ఇస్తున్నది.దీన్నే సాధారణ రాకపోకలు సాగుతున్నట్లు అమెరికా వర్ణిస్తున్నది. తమ అనుమతి లేని నౌకలు అటూ ఇటూ తిరిగితే పేల్చివేస్తామని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్ పేరుతో చర్చలు విఫలం కావాలని ఇరాన్ కోరుకుంటే తాము చేసేదేమీ లేదని జెడి వాన్స్ ఎదురు దాడికి దిగాడు.
రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం స్పష్టంగా ఉంది.కాల్పుల విరమణ లేదా ఇజ్రాయిల్ ద్వారా దాడులు సాగించటమా, ఏదో ఒకటి తేల్చుకోవాలి తప్ప రెండూ చేస్తామంటే కుదరదు. లెబనాన్‌లో జరుగుతున్న మారణ కాండను ప్రపంచం చూస్తున్నది, బంతి ఇప్పుడు అమెరికా కోర్టులో ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశాడు. అమెరికా అతి తెలివి ప్రదర్శించి దాడులను కొనసాగిస్తే ఎర్రసముద్రం-అరేబియా సముద్రం ద్వారా హిందూమహా సముద్రంలో ప్రవేశించే జలసంధి మార్గం బాబ్ ఎల్ మండాబ్‌ను కూడా దిగ్బంధనం చేయించేందుకు ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. అది గనుక జరిగితే ప్రపంచ సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది. ట్రంప్ వరుస చూస్తుంటే దాన్నీ వదిలేట్లు లేడు.
హార్ముజ్ జలసంధికి అమెరికాకు మధ్య పన్నెండువేల కిలో మీటర్ల దూరం ఉంది, దాని ఇరుగూ కాదు పొరుగూ కాదు. తమపై దాడులు చేసి కలిగించిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అది జరుగుతుందో లేదో తెలియదు గనుక ఆ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి రుసుము వసూలు చేసి దాన్ని ఎమెన్‌తో పంచుకుంటామని, తమకు కలిగిన దాడుల నష్టాలను పూడ్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్‌తో కలసి తాము పన్ను వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించటం తెంపరితనం తప్ప మరొకటి కాదు. తన చెప్పుచేతల్లో ఉంటాయనుకున్న నాటో దేశాలే ఇరాన్ సంక్షోభంతో తమకు సంబంధం లేదని తెగేసి చెప్పాయి. ఇరాన్ విషయంలో కూడా గొంతెమ్మ కోరికలను కోరుతున్న ట్రంప్‌కు అది జరిగేది కాదని త్వరలోనే తెలిసి వస్తుందని వేరే చెప్పనవసరం లేదు.
ట్రంప్ ఓ నమక్‌హరామ్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



