కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ‘డైమండ్ డెకాయిట్’ నేడు (శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్‌లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించగా, మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించారు. రచయిత, దర్శకుడు సూర్య జి.యాదవ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిలిం ఛాంబర్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడిం చింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదించాలని చిత్రబృందం కోరింది. హీరో, నిర్మాత పార్ధా గోపాల్ మాట్లాడుతూ,’ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది. కడపలో చిత్రీకరించిన అందమైన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలకు 4 షోలు ఉచితంగా ఏర్పాటు చేశాం. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి’ అని అన్నారు. ’33 ఏళ్ల క్రితం వచ్చిన ‘మాతృ దేవోభవ’ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎంతగా కదిలించిందో మనందరికీ తెలిసిందే. ఆ తరహా భావోద్వేగాన్ని మళ్లీ ఈ తరం ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నమే ఈ సినిమా. ఇది కేవలం సినిమా కాదు… ప్రతి కుటుంబంలో ఉన్న ప్రేమ, బాధ, త్యాగం, అనుబంధాలను ప్రతిబింబించే ఒక నిజమైన అనుభూతి. ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రేక్షకులు కన్నీటి పర్యంతం అవుతారు’ అని తెలిపారు.



