Friday, April 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు60 ఏండ్లలో మీరు కట్టింది 25 రిజర్వాయర్లే..

60 ఏండ్లలో మీరు కట్టింది 25 రిజర్వాయర్లే..

- Advertisement -

మేము 9 ఏండ్లలో 65 టీఎంసీలకు రిజర్వాయర్లు నిర్మించాం
పాలమూరు-రంగారెడ్డి మేజర్‌ పనులన్నీ మేమే పూర్తి చేశాం..
మిగిలిన పనులు చేయడం చేతకాలే..
కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడతారా..: ఏదుల బహిరంగ సభలో ఎమ్మెల్యే హరీశ్‌రావు
గొల్లపల్లి – చీర్కపల్లి రిజర్వాయర్‌ వ్యతిరేక రైతుల దీక్ష విరమణ


నవతెలంగాణ -వనపర్తి
”రాజకీయాల కోసం ఏనాడూ రైతులు దీక్షలు చేయలేదు.. కేవలం తమకు న్యాయం జరగాలన్న కాంక్షతోనే దీక్షలకు పూనుకుంటారు.. మీ కమీషన్ల కోసం గొల్లపల్లి- చీర్కపల్లి ప్రాజెక్టు కట్టడం సరికాదు.. 60ఏండ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టింది కేవలం 25 రిజర్వాయర్‌లే.. తొమ్మిది ఏండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మేము 65 టీఏంసీల రిజర్వాయర్‌లు నిర్మించాం. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ మేజర్‌ పార్ట్‌ మేమే పూర్తి చేశాం.. మిగిలిన చిన్న చిన్న పనులు పూర్తి చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేతకావడం లేదు..” అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. వనపర్తి జల్లా ఏదుల మండలం గొల్లపల్లి – చీర్కపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి వారితో దీక్ష విరమింపజేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఒకరు జిల్లాను దత్తత తీసుకున్నానని చెబితే.. మరొకాయన వలసల జిల్లాను చేశారని విమర్శించారు. అన్ని నీళ్లు పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్‌లో ఉంటే పాలమూరు ఎట్టా ఉండేదో ఆలోచించుకోవాలన్నారు. అనేక కేసులు వేసి ప్రాజెక్ట్‌ పనులకు అడ్డుకట్ట వేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నది నల్లమల పులి కాదని.. అది పిల్లి.. అని ఎద్దేవా చేశారు. కేఎల్‌ఐలో వనపర్తి నియోజకవర్గం లేదని.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒప్పించి వనపర్తికి నీళ్లు ఇప్పించారన్నారు. గొల్లపల్లి – చీర్కపల్లి రిజర్వాయర్‌ అవసరం లేదని, ఏదుల నుంచి నీళ్లు పారుతాయని ఆనాడే తేల్చి చెప్పామన్నారు. మీ కమీషన్‌ల కక్కుర్తి కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయొద్దని కోరారు. మీ భూములు కాపాడుతామని రైతులకు భరోసానిచ్చారు.

ఇక్కడ ప్రాజెక్టు కట్టకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను జూరాల దగ్గర కట్టాల్సిందని అంటున్నారని, బుద్ధి వున్న ఎవరైనా అది సరైంది అంటారా? అని ప్రశ్నించారు. వలసలు వాపస్‌ అని బీఆర్‌ఎస్‌ హయాంలో వార్తలు వచ్చాయన్నారు. పాలమూరు పచ్చని రంగు వేసుకున్నదని పేపర్లో హెడ్డింగ్‌లు వచ్చాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నర ఏండ్లలో పదివేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినవా అని ప్రశ్నించారు. కానీ తెలంగాణ ఆరు గ్యారంటీలు అమలు చేశామని కేరళంకు వెళ్లి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఇక్కడ ఏం చేయలేదుగానీ.. కేరళం వెళ్లి అన్నీ చేసేసాం అని చెప్పడమే గొప్పనా అని నిలదీశారు. ఈ సభలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టుయాదవ్‌, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, టిఆర్‌ఎస్‌ జిల్లా, ఏదుల రేవల్లి మండలాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -