Friday, April 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజీవన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ సాదర ఆహ్వానం

జీవన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ సాదర ఆహ్వానం

- Advertisement -

కేసీఆర్‌కు, జీవన్‌రెడ్డికి 40ఏండ్లకుపైగా స్నేహం : కేటీఆర్‌
కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది : జీవన్‌రెడ్డి
జగిత్యాలలో జీవన్‌రెడ్డితో కేటీఆర్‌ భేటీ
13 లేదా 27న కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం

నవతెలంగాణ – జగిత్యాల టౌన్‌
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి సాదర స్వాగతం పలుకుతున్నట్టు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డితో గురువారం జగిత్యాలలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నాయకులు ఎల్‌.రమణ, కె.విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, కె.సంజయ్ కుమార్‌, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి వెళ్లిన కేటీఆర్‌ జీవన్‌రెడ్డిని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు.

జిల్లాలో ఘన స్వాగతం.. భారీ బైక్‌ ర్యాలీ
కేటీఆర్‌ జగిత్యాల రాకను పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జగిత్యాల శివారులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వందలాది బైకులతో భారీ ర్యాలీగా జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే కేటీఆర్‌ ఆయనతో ఫోన్‌లో చర్చలు జరపగా, ప్రత్యక్షంగా భేటీ అయ్యి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌, జీవన్‌రెడ్డి మధ్య 40ఏండ్లకు పైగా స్నేహం ఉందన్నారు. 2014కు ముందు కూడా పార్టీలోకి ఆహ్వానించామని, ఇప్పుడు మరోసారి ఆహ్వానించామని తెలిపారు. రెండ్రోజుల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలుస్తానని జీవన్‌రెడ్డి చెప్పారని అన్నారు.

27నెలలు క్షోభ : మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
27నెలలుగా చాలా క్షోభ అనుభవించానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. తాను బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చిందని, బీఆర్‌ఎస్‌తో పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్‌కు పాటుపడొచ్చని అన్నారు. బీఆర్‌ఎస్‌ కంటే మెరుగైన పాలన కోసం కాంగ్రెస్‌కు ఓటేశారని, కానీ రాష్ట్రంలో అభివృద్ధి తిరోగమనంలో ఉందన్నారు. కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో జీవన్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఏప్రిల్‌ 13 లేదా 27 న కేసీఆర్‌ సమక్షంలో జీవన్‌ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -