వచ్చే మూడ్రోజులు ఎండలు పెరిగే అవకాశం
ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. వచ్చే మూడ్రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి నాలుగు డిగ్రీల మేరకు పెరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జాబితాలో యాదాద్రి భువనగిరి, వనపర్తి, వికారాబాద్, సిద్దిపేట్, సంగారెడ్డి, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జనగాం, జగిత్యాల, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఈ నెల 16వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుంది. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలనీ, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ద్రావణాన్నిగానీ, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, ఉప్పు-పంచదార ద్రావణం వంటివిగానీ తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్రనాయక్ ప్రజలకు సూచించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3:00 గంటల వరకు అత్యవసరమైతేగానీ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఒదులైన లేత వర్ణపు కాటన్ బట్టలను వాడాలనీ, బయటకు వెళ్లే సమయంలో తలను కప్పి ఉంచేలా టోపీలనుగానీ, గొడుగులను గాని వాడాలని పేర్కొన్నారు.



