సర్కారు వైఖరి మారకపోతే
13న సమ్మె తేదీని ప్రకటిస్తాం: జేఏసీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో గురువారం కార్మిక శాఖ అధికారులు భేటి అయ్యారు. ఆర్టీసీ యాజమాన్యంతో సమ్మె డిమాండ్లపై చర్చలు జరపడానికి ఈ సమావేశం నిర్వహించారు. సమ్మె నోటీస్ ఇచ్చిన పలు కార్మిక సంఘాల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. గతంలో మాదిరీగానే ఆర్టీసీ యాజమాన్యం సంప్రదింపుల సమావేశానికి గైర్హాజరైనట్టు సంఘాల నేతలు చెప్పారు. ఈనేపథ్యంలో ఈనెల 13న మరో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ ఈదురు వెంకన్న, వైస్‌చైర్మెన్ వి థామస్‌రెడ్డి కన్వీనర్ వీణ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్ డి యాదగిరి తెలిపారు.
గత మార్చి 13న సమ్మె నోటీస్ ఇచ్చి నెల రోజులు కావస్తున్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తున్నారని చెప్పారు. సమ్మె నివారణ చర్యలు చేపట్టడం లేదేన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే ఈనెల 13న సమ్మె తేదీని ప్రకటిస్తామని హెచ్చరించారు. సమ్మె డిమాండ్లపై కార్మిక శాఖ చర్చలు జరపడానికి సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం తలపెట్టిన కార్మిక గర్జన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.



