కొత్త గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రాంతాల గుర్తింపు
మొదటి దశలో 12 చోట్ల నిర్మాణం
2030 వరకు 3,400 మెగావాట్లు లక్ష్యం
కేంద్ర మార్గదర్శకాలు, ఫ్రీ పొల్యూషన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. పారిస్ ఒప్పందం ప్రకారం విద్యుత్ అవసరాల్లో 2030 నాటికి 50 శాతం, 2070 నాటికి 100 శాతం గ్రీన్ ఎనర్జీ వాడాల్సి ఉంటుంది. దానికి తోడు తెలంగాణ భవిష్యత్ అవసరాలకు ఇంధన కొరత రాకుండా ఉండేందుకు జీరో పొల్యూషన్ ప్రాతిపదికన కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్(పీఎస్‌హెచ్)ల వైపు సర్కార్ దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొండలు, గుట్టలను ఆనుకుని ఉన్న రిజర్వాయర్లు, నదులు గల 23 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. మొదటి దశలో 12 ప్రాంతాల్లో తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీఎస్జెన్కో), సింగరేణితో పాటు పలు ప్రయివేట్ సంస్థలు ఈ రంగంలో కొత్తగా విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
ఊరగొండ మల్లేశం
కొత్త గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజీ హైడ్రో (పీఎస్‌హెచ్), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్), ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ రంగంలో 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో పీఎస్ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రాంతాలు అనుకూలమని గుర్తించారు. మొదటి దశలో 12 ప్రాంతాల్లో 3,400 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్‌లను 2030 వరకు ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఎత్తైన కొండలు, గుట్టలను ఆనుకుని ఉన్న రిజర్వాయర్లు, నదులు ప్రవహించే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు ఈ రంగంలో ప్రాజెక్ట్‌లు నిర్మించేందుకు సర్కార్‌తో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. బొగ్గు మైనింగ్ ప్రాంతాల్లోని నీటిని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ భావిస్తోంది.
ఇప్పటికే ఆ దిశగా మొదటి అడుగు వేసింది. మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో నీటి సంప్‌ను దిగువ రిజర్వాయర్‌గా ఉపయోగించి తెలంగాణలో మొట్టమొదటి ప్లాంట్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. అలాగే భద్రాది కొత్తగూడెం జిల్లా జవహర్ ఖని ఓపెన్ కాస్ట్ మైన్‌లో 100 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్‌హెచ్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సన్ పెట్రోకెమికల్స్ సంస్థ రాబోయే పదేండ్లలో రూ.45,500 కోట్ల వ్యయంతో 3,400 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్‌లను నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. జిందాల్ కంపెనీకి చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సంస్థ 1,500 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్‌ను కొమురం భీం పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పేరుతో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ.12,400 కోట్లతో 1,350 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్రాజెక్ట్‌లను ప్రతిపాదించింది.
ములుగు జిల్లా కోయ బెస్తగూడెంలో 850 మెగావాట్లు, నాచారంలో 500 మెగావాట్లతో ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలోని మైలారం గ్రామం సమీపంలో మరో 600 మెగావాట్ల ప్రాజెక్టును ఓ ప్రయివేట్ సంస్థ ప్రతిపాదించింది. ఇవి కాకుండా టీజీజెన్కోతో పాటు ఇతర ప్రయివేట్ సంస్థలు సైతం ఈ రంగంలో కొత్తగా విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. పీఎస్ఈ విద్యుత్ కేంద్రాలు జలాశయాల్లోని నీటిని దిగువ నుంచి ఎగువకు మళ్లించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. నీటిని మళ్లించే క్రమంలో టర్బైన్లు వెనకకు తిరుగుతాయి. అప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలా రెండు రకాలుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ విధానం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ చవకగా లభించడంతో పాటు పీక్ డిమాండ్‌లో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సోలార్, హైడెల్, పంప్డ్ స్టోరేజీ విధానంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జనరేషన్.. స్టోరేజీ
పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్‌లో హైడ్రో పవర్, జల విద్యుత్‌ను నిల్వ చేయవచ్చు. దీన్ని వేర్వేరు ఎత్తుల్లో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. వీటి మధ్య టర్బైన్ల గుండా నీరు ఒకదాని నుంచి మరొక దానికి (డిశ్చార్జ్) కదులుతున్నప్పడు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి అయిన శక్తిని నిల్వ చేస్తుంది. అలాగే అవసరమైనప్పుడు దాన్ని విడుదల చేయగలదు. ఎగువ రిజర్వాయర్ (రీచార్జ్)లోకి నీటిని తిరిగి పంప్ చేస్తున్నందున దానికి అవసరమైనప్పుడు విద్యుత్‌ను అందించడానికి పీఎస్‌హెచ్ పెద్ద బ్యాటరీగా పని చేస్తుంది.
రెండు విధాలా ఉపయోగకరం
పీఎస్ఈ ప్లాంట్లలో పగటి పూట చార్జింగ్ సౌర పలకాల ద్వారా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందికి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తక్కువ గాలి, సూర్యరశ్మి లేకపోవడం వంటి పరిస్థితుల్లో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థికంగా లాభదాయకంగా పెద్ద ఎత్తున శక్తిని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్లు సామర్థ్యంలో 82 శాతం వరకు పని చేస్తాయి. అలాగే వీటి జీవిత కాలం 80 సంవత్సరాల వరకు ఉంటుంది.
పదేండ్లలో నిర్లక్ష్యం
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదేండ్ల కాలంలో విద్యుత్ స్టోరేజీ విషయంలో నిర్లక్ష్యం జరిగింది. ఎనర్జీ స్టోరేజీకి రౌండ్-ది-క్లాక్ విధానం అవసరం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు ఈ విధానంలో మిగులు విద్యుత్‌ను స్టోరేజీ చేస్తున్నాయి. పీక్ స్టేజీలో ఆయా రాష్ట్రాలు స్టోరేజీ విద్యుత్‌ను వాడుకుం టున్నాయి. ఇందులో బ్యాటరీ, పంప్ స్టోరేజీ విధానాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ విధానం ఖరీదైనదిగా ప్రపంచమంతా భావిస్తున్న నేపథ్యంలో సర్కార్ రెండో విధానం వైపు దృష్టి సారించింది. పంప్డ్ స్టోరేజీ విద్యుత్ తయారీకి తెలంగాణలోని 23 ప్రాంతాలు భౌగోళికంగా అనుకూలమని పలు సర్వేల్లో తేలింది. మొదటి దశలో 12 ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పతి ప్రాజెక్ట్‌లను ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే వీటి నిర్మాణానికి 4నుంచి 5 ఏండ్లు పడుతుంది.




