విద్య ప్రతి చిన్నారి హక్కు. కానీ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల మోత సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారంగా మారుతోంది. నాణ్యమైన విద్య పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా, ఫీజుల నిర్ణయానికి పారదర్శ కమైన ప్రమాణాలు లేకపో వడం, ప్రభుత్వం సమ ర్థవం తమైన నియంత్రణ వ్యవస్థను అమలు చేయక పోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు తమ ఆదా యంలో భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి రావడంతో కుటుంబ ఆర్థిక భద్రత దెబ్బ తింటోంది. విద్యను హక్కుగా కాపాడాల్సిన ప్రభుత్వం ఈ భారాన్ని తగ్గించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణలో 39 వేలకుపైగా పాఠశాలలు ఉండగా, 12 వేలకుపైగా ప్రయివేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థుల్లో దాదాపు 60శాతం మంది ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నారు. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లోనే సుమారు 5,500 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి.
ప్రభుత్వ విద్యపై నమ్మకం తగ్గడం, పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగాలపై ఆందోళనతో తల్లిదండ్రులు ప్రయివేటు విద్యను ఆశ్రయిస్తున్నారు. ఈ అవసరాన్ని కొన్ని సంస్థలు విద్యా సేవగా కాకుండా వ్యాపార అవకాశంగా మలుచుకుం టున్నాయి. హైదరాబాద్‌లో అనేక ప్రయివేటు పాఠశాలల్లో వార్షిక ఫీజు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉంటోంది. కొన్ని కార్పొరేట్ సంస్థల్లో జేఈఈ, నీట్ ఇంటిగ్రేటెడ్ కోర్సులకు రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, పరీక్షలు, ఇతర కార్యక్రమాల పేరుతో మరో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అదనపు భారం పడుతోంది. రవాణా, హాస్టల్ వంటి సదుపాయాలు అవసర మైతే ఖర్చు మరింత పెరుగుతోంది. దీంతో పిల్లల చదువు మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఉద్యో గాల కోసం వచ్చిన మధ్యతరగతి కుటుంబాలు ఈ భారంతో సతమతమ వుతున్నాయి. గృహ రుణాలు, వైద్య ఖర్చులు, ఇంటి నిర్వహణ, వృద్ధుల సంరక్షణ వంటి బాధ్యతల మధ్య పిల్లల చదువుకు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.
కొందరు కుటుంబాల్లో ఇద్దరు పిల్లల విద్యకే వార్షిక ఆదాయంలో సగానికిపైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫీజుల కోసం పొదుపులను ఖర్చు చేయడం, రుణాలు తీసుకోవడం వంటి పరిస్థితులు కుటుంబాల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తున్నాయి. విద్య భవిష్యత్తుకు పెట్టుబడి కావాలి తప్ప కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టే భారంగా మారకూడదు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం విద్యాహక్కు చట్టం అమలు. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయివేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ప్రవేశ స్థాయిలో 25 శాతం సీట్లను సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు కేటాయించి ఉచిత విద్య అందించాలి. క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం కూడా చట్టవిరుద్ధం. అయితే ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతు న్నాయన్నది ప్రశ్నార్థకమే. ప్రస్తుతం ప్రొఫెషనల్ కళాశాలలకు టిఎఎఫ్‌ఆర్‌సి ఉన్నప్పటికీ, పాఠశాలలు, జూని యర్ కళాశాలల ఫీజులను నియంత్రించే సమగ్ర చట్టబద్ధ వ్యవస్థ తెలంగాణలో ఇంకా లేదు. ఈ ఖాళీని భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రతిపాదించిన ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను ప్రభుత్వం త్వరగా అమలు చేయాలి.
అది కేవలం ఫీజులు నిర్ణయించే సంస్థగా కాకుండా, విద్యాసంస్థల ఆర్థిక పారదర్శకతను పర్యవేక్షించే బలమైన సంస్థగా ఉండాలి.ఫీజుల నిర్ణయానికి స్పష్టమైన ప్రమాణాలు ఉండాలి. ఉపాధ్యాయుల వేతనాలు, మౌలిక వసతులు, విద్యా సామగ్రి, నిర్వహణ ఖర్చులు వంటి వాస్తవ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంస్థకు ఎంత వ్యయం అవుతోంది, దానికి అనుగుణంగా ఎంత ఫీజు అవసరమో లెక్కలు పరిశీలించాలి. వార్షిక ఆడిట్ తప్పనిసరి చేయాలి. తల్లిదండ్రుల ప్రతినిధులకు ఫీజుల నిర్ణయంలో భాగస్వామ్యం కల్పించాలి. పుస్తకాలు, యూనిఫాం, పరీక్షలు, కార్యక్రమాల పేరుతో అనధికారికంగా అదనపు వసూళ్లు చేయకుండా నియంత్రణ ఉండాలి. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత మరో పేరుతో కొత్త భారం మోపే విధానానికి కూడా అడ్డుకట్ట అవసరం ఇక్కడ ప్రయివేటు విద్యను పూర్తిగా వ్యతిరేకించడం పరిష్కారం కాదు. నాణ్యమైన బోధన, మెరుగైన మౌలికవసతులు, నైపుణ్యమున్న ఉపాధ్యాయులు కల్పించేందుకు ప్రయివేటు సంస్థలకు నిర్వహణ వ్యయం అవసరం. కానీ, దానిని కారణంగా చూపి ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచడం మాత్రం సమర్థనీయం కాదు. ప్రభుత్వం ప్రయివేటు రంగాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశం కాదు,దాన్ని బాధ్యతాయుతమైన నియంత్రణలోకి తీసుకు రావాలి.
విద్యాసంస్థల స్వేచ్ఛతో పాటు తల్లి దండ్రుల హక్కులకు కూడా సమాన ప్రాధాన్యం ఉండాలి. గత ప్రభుత్వాలు అమలు చేసిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోని ఫీజు నియంత్రణ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలి. ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌కు స్పష్టమైన అధికారాలు, స్వతంత్రత కల్పించాలి. రాజకీయ లేదా విద్యాసంస్థల ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకునే విధానం ఉండాలి. తల్లిదండ్రుల ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి పరిష్కారం చూపే వ్యవస్థను కూడా అందులో భాగం చేయాలి. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం అత్యంత అవసరం. మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ సదుపాయాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా వసతులు మెరుగుపరచాలి. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసి, వారి నైపుణ్యాన్ని పెంచాలి. పోటీ పరీక్షలకు అవసరమైన మార్గదర్శకత్వం, కెరీర్ కౌన్సెలింగ్ వంటి సదుపాయాలను కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందుబాటులోకి తీసుకురావాలి.
ప్రభుత్వ విద్యపై ప్రజలకు విశ్వాసం పెరిగితే ప్రయివేటు విద్యపై ఆధారపడే ఒత్తిడి తగ్గుతుంది. ప్రభుత్వ పాఠశాలలు బలహీనంగా ఉంటే ప్రయివేటు విద్యకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిన కొద్దీ ఫీజులు పెంచే అవకాశం విద్యాసంస్థలకు లభిస్తుంది. చివరికి ఆ భారాన్ని తల్లిదండ్రులే మోయాల్సి వస్తుంది. అందుకే ఫీజుల నియంత్రణతోపాటు ప్రభుత్వ విద్య బలోపేతం కూడా సమాంతరంగా సాగాలి. విద్యను కేవలం మార్కెట్ వస్తువుగా చూడటం సమాజానికి ప్రమాదకరం. విద్య, వైద్యం వంటి రంగాలు ప్రజల జీవన ప్రమాణాలను, సమాజ భవిష్యత్తును నిర్ణయించే మౌలిక రంగాలు. అందుకే వీటిపై ప్రభుత్వ బాధ్యత అత్యంత కీలకం. నాణ్యతకు ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, ఫీజుల పేరుతో కుటుంబాలపై అన్యాయమైన భారాన్ని మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫీజుల దోపిడీని అరికట్టడం కేవలం తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడం కాదు, సమాజంలో సమాన అవకాశాలను కాపాడటం కూడా. పారదర్శక ఫీజు నియంత్రణ, బలమైన ప్రభుత్వ విద్య, ప్రయివేటు సంస్థలపై సమర్థవంతమైన పర్యవేక్షణ-ఈ మూడు చర్యలు కలిసి సాగాలి. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా, విద్య వారి భవిష్యత్తుకు నిజమైన పెట్టుబడిగా మారేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. అదే విద్యను నిజమైన ప్రజాహక్కుగా నిలబెట్టే మార్గం.
ప్రొ.కొండా నాగేశ్వర్,
9885295413



