తెలంగాణ తాజా రాజకీయాలు 1908 నాటి రిజిస్ర్టేషన్ చట్టంలోని సెక్షన్ 22పై నడుస్తున్నాయి. ఆ సెక్షన్ ప్రజల పాలిట గుదిబండగా మారి రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. తమవైన కోట్ల రూపాయల ఆస్తులను ఒక సెక్షన్ పేర ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకునే పరిస్థితిని సృష్టించింది. ‘మా ఆస్తులపై సర్కారు పెత్తనమేంటి?’ అంటూ ప్రజలే ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది. ప్రభుత్వ, మతపరమైన, సీలింగ్, మిగులు భూములు లేదా చట్టపరమైన వివాదాలకు సంబంధించిన ఆస్తుల రిజిస్ర్టేషన్, అమ్మకం, లేదా బదిలీని నిషేధించిన ప్లాట్లు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. అలాగే వక్ఫ్ ఆస్తులు, కోర్టు జప్తుచేసిన ఆస్తులు కూడా ఇందులోనే ఉంటాయి. ఇటీవల ప్రభుత్వం డేటా బేస్ అప్‌డేట్‌లు, రికార్డుల అనుసంధాన ప్రక్రియలో వేలాది ఎకరాలు ప్రయివేటు పట్టా భూమి, చట్టబద్దమైన నివాస కాలనీలు అక్రమంగా నిషేధిత జాబితాలో నెట్టబడ్డాయి.
హైదరాబాద్‌లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గృహ యజమానులు పరిపాలనా లోపాల కారణంగా ఆస్తి లావాదేవీల్లో తీవ్రజాప్యంతోపాటు అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. పొరపాట్లను సరిచూసి ప్రజలకు నష్టం జరగకుండా చూడటంలో సర్కారీ రిజిస్ర్టేషన్ల శాఖ వెనుకబడింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రత అధికంగా ఉంది. ఈ తరహా సమస్యలున్న ఆస్తులు రాష్ట్రంలో తొంభై లక్షలకుపైగా ఉండగా, ఇందులో హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న జిల్లాల్లో 54 శాతం కావడం దారుణం. గత ఏప్రిల్‌లో రెవెన్యూ శాఖ డేటాను ధరణి పోర్టల్ నుంచి భూభారతికి అనుసంధానం చేసింది. సాంకేతిక పొరపాట్ల కారణంగా వేలాది ఎకరాల ప్రయివేటు ప్లాట్లు, ఫ్లాట్లు 22 ఏ జాబితాలోకి వెళ్లాయి. కొన్ని పొరపాటని చెబుతున్నా, కావాలని చేసినవి కూడా ఉన్నాయి. 22ఏ పరిధిలోని జాబితాను ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలిస్తూ సర్కారుకు మొట్టికాయలు సైతం వేసి నిల దీసింది. 2023లో ఇది చట్టబద్దమేనని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ప్రభుత్వం తన ఆస్తులను రక్షించు కోవచ్చు.
కేవలం రిజిస్ర్టేషన్‌ను నిరాకరించిన మాత్రాన ఆస్తిహక్కును కోల్పోరు. మీరు కోర్టును ఆశ్రయించ వచ్చు. దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్నప్ప టికీ, కేవలం దుర్వినియోగం కారణంగా ఏకంగా చట్టాన్ని రద్దుచేయలేమని’ హైకోర్టు వ్యాఖ్యా నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలకు పూనుకున్నది. గతంలో కేవలం సర్వే నెంబర్లు మాత్రమే ఉండేవి. తాజాగా సంస్కరణల్లో భాగంగా సర్వేనెంబర్లతో పాటు స్కాన్ కాపీ, సంతకం చేసిన ఆధారాలతో కూడిన 12 కాలాల ప్రొఫార్మా వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేస్తున్నది. అలాగే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే 22బీ కింద మోసపూరిత రిజిస్ర్టేషన్ పత్రాలను రద్దుచేసేలా స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీకి అధికారాలు కట్టబెట్టేందుకు ఆలోచిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తరహాలో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. గత పదేండ్లుగా 22ఏను అడ్డంపెట్టుకుని ప్రభుత్వంలోని పెద్దలు అక్రమ రియాల్టీ వ్యాపారాలను చేస్తున్నారనే తీవ్ర విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ప్రయి వేటుతోపాటు ప్రభుత్వ భూములను ఈ సెక్షన్ నుంచి విముక్తి కల్పించడానికి కమీషన్ల బేరం నీకింత నాకింత తరహాలో క్విడ్‌ప్రోకో నడుస్తున్నది.
ఇందులో ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధులతోపాటు అధికారులూ మిలాఖతై ఉన్నారనేది నగ్నసత్యం. ఈ భూమాఫియాను ప్రోత్సహిస్తున్నది గత, ప్రస్తుత పాలకులే కావడం మరీ ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కలే ఈ అక్రమాలు ఎక్కువ. ఈ విషయంలో పాలకులు మారుతున్నారే తప్ప విధానం ఒకేలా ఉంది. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఒకవైపు ప్రభుత్వ భూము లను కాపాడటానికే 22ఏ అంటూ, మరోవైపు అందుకు విరుద్ధమైన పనులు చేసి సొంత ఆస్తులు పెంచేసుకుం టున్నారు. మధ్య తరగతి ప్రజలేమో డేటా ఎంట్రీ సరిగ్గా చేయని కారణంగా సొంత ఆస్తులు, ప్లాట్లు, ఫ్లాట్లను పొందలేని దారుణ దుస్థితిలోకి నెట్టబడ్డారు. పొరపాట్లు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి క్షమాపణ చెప్పినా, ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలం కాలేదు. ఇప్పటికైనా సీఎం చెప్పినట్టుగా గందర గోళాన్ని సరి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పటిష్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే 22 ఏ రాష్ట్రంలో ‘భూ’ ప్రకంపనలనే సృష్టిస్తుంది.
‘భూ’ప్రకంపనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



